YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వాహనాలకు ట్రాకింగ్‌ డివైస్‌లు

వాహనాలకు ట్రాకింగ్‌ డివైస్‌లు

విజ‌య‌వాడ‌, అక్టోబ‌రు 19, 
ఆటోలు, ట్యాక్సీల్లో ప్రయాణించే మహిళల రక్షణకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే ఓ ప్రాజెక్ట్‌ అమల్లోకి రానుంది. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ప్రయోగాత్మకంగా విశాఖలో తొలుత వెయ్యి ఆటోలకు ట్రాకింగ్‌ డివైస్‌లు బిగించి.. ఆటోల్లో ప్యానిక్‌ బటన్లు అమరుస్తారు. ఈ నెలాఖరున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఇందులో సాంకేతిక లోపాలు, ఇబ్బందులు ఏమైనా ఎదురైతే వాటిని సరిచేసి రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమల్లోకి తెస్తారు. ఈ ప్రాజెక్ట్‌ అమలుకు రూ.138 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం 2015లోనే రాష్ట్రానికి రూ.80 కోట్లు కేటాయించింది. అయితే.. అప్పటి చంద్రబాబు సర్కారు ఈ ప్రాజెక్ట్‌ అమలుపై నాన్చివేత ధోరణి అవలంభించింది. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించడంతో త్వరలోనే పట్టాలెక్కబోతోంది.రవాణా వాహనాలకు దశల వారీగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) బాక్స్‌లు అమరుస్తారు. తద్వారా ఆ వాహనాలన్నీ రవాణా, పోలీస్‌ శాఖ కాల్‌ సెంటర్లు, కంట్రోల్‌ రూమ్‌లతో అనుసంధానం అవుతాయి. ఐఓటీ బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్‌ఎఫ్‌ఐడీ) కార్డులు ఇస్తారు. ఆ కార్డులను వాహనం ఇంజన్‌ వద్ద అమర్చిన ఐఓటీ బాక్సుకు స్వైప్‌ చేస్తేనే సదరు వాహనం స్టార్ట్‌ అవుతుంది. ప్రయాణంలో మహిళలు ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే.. ప్యానిక్‌ బటన్‌ నొక్కితే సరిపోతుంది. సదరు వాహనం ఎక్కడ ఉందో తెలుసుకుని పోలీసులు ఇట్టే పట్టేస్తారు. వెనువెంటనే వాహనం వద్దకు చేరుకుని ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు క్షణాల్లోనే భద్రత కల్పించి అకృత్యాలకు అడ్డుకట్ట వేస్తారు.ఈ ఏడాది జనవరిలో రవాణా శాఖ ఓ యాప్‌ను రూపొందించింది. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ట్రాకింగ్‌ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు. వాటిని అనుసంధానిస్తూ ప్రతి ఆటో, క్యాబ్‌లో ప్యానిక్‌ బటన్లు అమరుస్తారు. గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (జీపీఎస్‌) ద్వారా ఆ వాహనాలు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాయో తెలుసుకునే వీలు కలుగుతుంది. వాటిలో ప్రయాణించే మహిళలకు ఏదైనా ఆపద, అవాంఛనీయ ఘటనలు ఎదురైతే ప్యానిక్‌ బటన్‌ నొక్కితే.. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఆధారంగా రవాణా శాఖ కమిషనరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సమాచారం వెళుతుంది. ఆ తర్వాత మహిళలు, చిన్నారుల రక్షణకు ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 112కు ఫిర్యాదు వెళుతుంది. ట్రాకింగ్‌ డివైస్‌లను ఆటో, క్యాబ్‌ ఇంధన ట్యాంకులతో అనుసంధానించడం వల్ల ఆపదలో అవి ఎక్కువ దూరం ప్రయాణించలేవు.

Related Posts