విజయవాడ, అక్టోబరు 19,
ఏపీలో స్థానిక ఎన్నికల వివాదం మళ్లీ రాజుకుంది. రాష్ట్ర హైకోర్టులో ఓ వ్యక్తి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో ఈ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అయితే, ఇప్పుడు కరోనా తీవ్రంగా ఉంది కనుక దీనిపై దృష్టి పెట్టలేదని పేర్కొంది ప్రభుత్వం. కానీ, ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారుగా అన్న ప్రశ్నకు ఇటు ప్రభుత్వం కానీ, అటు పిల్ వేసిన న్యాయవాది కానీ సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేక పోయారు.అయితే, ఇప్పుడు ఈ విషయంలో రెండు కీలక విషయాలు చర్చకు వచ్చాయి. జగన్ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టం లేకనే కరోనాను బూచిగా చూపిస్తోందని అంటున్నారు. మరోవైపు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లడం వల్ల కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని చెబుతోంది.వాస్తవానికి మార్చిలోనే ఎన్నికలు పూర్తికావాలి. కానీ, అప్పట్లో హఠాత్తుగా వాయిదా వేశారు. అప్పట్లో కరోనా ప్రభావం మరీ అంతగా లేనప్పుడు స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే దీనిపై నిమ్మగడ్డ కరోనా వల్లే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశానని చెప్పగా సీఎం జగన్ నేరుగానే ఆయనకు కులం ఆపాదించి తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు ఏపీలో కరోనా జోరుగా ఉంది. రోజుకు యాభై మంది చనిపోతున్నారు.అయినా.. ఎన్నికలు నిర్వహించాలనేలా.. మరీ ముఖ్యంగా నిమ్మగడ్డకు.. ప్రభుత్వానికి మధ్య వివాదం రేపేలా .. కొన్ని వర్గాలు చక్రం తిప్పుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను నిర్వహించలేక పోతోంది. పేదలకు ఇళ్లు, స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం వంటివాటిని అమలు చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తే.. తమకు లబ్ధి చేకూరుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది