రెంటికీ చెడ్డ రేవడిలా వంశీ పరిస్థితి
విజయవాడ,
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందట. టీడీపీలో కొనసాగినంత కాలం ఎదురులేని రాజకీయాలు నెరపిన ఆయన ఇప్పుడు ఢీలా పడిపోతున్నట్లు తెలుస్తోంది. ఇక రాజకీయాల్లో మనం మనుగడ సాగించలేమనే స్థాయిలో వంశీ నిరుత్సాహ పడిపోయినట్లు నియోజకవర్గంలో చర్చ సాగుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపును ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ.. ఇటీవలి కాలంలో ఆ పార్టీని వీడి వైసీపీ మద్దతు దారుడిగా కొనసాగుతున్నాడు. అయితే వైసీపీలో వంశీకి సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆశీస్సులు ఉన్నప్పటికీ స్థానిక రాజకీయాలతో వల్లభనేని వంశీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వంశీ చేతిలో వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమిపాలయ్యాడు. అప్పటి నుండి ఆయనే నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. అయితే వంశీ టీడీపీని వీడి వైసీపీ మద్దతుదారుడిగా ఉండటంతో యార్లగడ్డ వర్గానికి రుచించడం లేదు. దీనికితోడు అదే పార్టీలో ఉన్న దుట్టా రామచంద్రరావు వర్గీయులుసైతం వంశీ వైసీపీలోకి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆ రెండు వర్గాల నుంచి ఎదురవుతున్న సవాళ్లతో వంశీ ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇలాంటి రాజకీయాల్లో తాను మనుగడ సాగించలేనని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని తన వర్గీయుల వద్ద వంశీ వాపోయినట్లు వార్తలు సైతం గుప్పుమన్నాయి. కొద్దిరోజులకే వీరి మధ్య జగన్ సయోధ్య కుదిర్చినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఇప్పటికీ యార్లగడ్డ, వంశీ, దుట్టా వర్గాలుగా గన్నవరం వైసీపీలో రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎవరికివారే తమతమ ఆధిపత్యాలను కొనసాగించేందుకు వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు, మళ్లీ నియోజకవర్గంలో ఏకచక్రాధిపత్యం కొనసాగించేందుకు వంశీకి ఆయన అనుచరులు కొత్త సలహా ఇస్తున్నారంట. ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి తిరిగి వెళ్లడం సాధ్యం కాదని, అలా అని వైసీపీలో ఉండి తమ బలాన్ని నిరూపించుకోవటం కూడా సాధ్యమయ్యే పనికాదని వంశీకి ఆయన అనుచరులు హితబోద చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం రాజకీయాలను వీడటం కంటే వర్గాన్ని కాపాడుకొనేందుకు, ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు బీజేపీలోకి వెళితే బాగుంటుందని పలువురు వంశీకి సలహాలు ఇస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీలో ఉన్న సుజనాచౌదరితో పాటు పలువురు బీజేపీ పెద్దలతో వంశీకి సత్సంబంధాలు ఉన్నాయి. వీరి ద్వారా బీజేపీలోకి వెళ్లి నియోజకవర్గంలో తమ వర్గీయులను కాపాడుకుంటే బాగుంటుందని వంశీకి ఆయన అనుచరులు సలహాలు ఇస్తున్నారంట. మరి వంశీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.