మోదుగుల వేణుగోపాలరెడ్డి మౌనం రీజనేంటీ...
గుంటూరు
గుంటూరుకు చెందిన రాజకీయ నాయకుడు, ఫైర్ బ్రాండ్.. మోదుగుల వేణుగోపాలరెడ్డి కొన్నాళ్లుగా మౌనంగా ఉంటున్నారు. నిజానికి ఆయన ఇంత మౌనంగా ఉంటున్నారంటే.. ఏదో వ్యూహం వేస్తున్నారనే సంకేతాలు వచ్చినట్టేనని అంటున్నారు ఆయన అనుచరులు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే అయి ఉండి.. మౌనంగా వున్నారు. అనంతరం ఆయన బాంబు పేల్చారు. రెడ్డి సామాజిక వర్గానికి బాబు పాలనలో విలువ లేదని, రెడ్డి వర్గం అధికారంలోకి రావాలంటూ.. వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే అప్పటి వరకు టీడీపీలో ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డి వైసీపీలోకి జంప్ చేశారు.ఇక, ఇప్పుడు ఏం చేస్తారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? దీనివెనుక ఏం జరుగుతోంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఒక్కసారి ఆయన చరిత్రను చూస్తే.. 2009లో టీడీపీ తరఫున నరసారావు పేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో అనూహ్య పరిస్థితిలో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఆయన విజయం దక్కించుకున్నారు. అయితే, చంద్రబాబు మంత్రి వర్గంలో సీటు ఆశించినా.. బాబు ఇవ్వకపోవడంతో రెబెల్ ఎమ్మెల్యేగా మారిపోయి.. బాబు సర్కారుపై విమర్శలు గుప్పించారు.ఈ క్రమంలోనే మోదుగుల వేణుగోపాలరెడ్డి గత ఏడాది ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చి.. పట్టుబట్టి గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కమ్మల హవాకు బ్రేక్‌చేస్తానని ప్రతిజ్ఞ చేసినా.. ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఆశించారని ప్రచారంలోకి వచ్చింది. కాదు, ఆయన రేంజ్‌కు రాజ్యసభ ఆశించారని మరో ప్రచారం కూడా తెరమీదికి వచ్చింది. అయితే, ఈ రెంటిలో ఏదీ కూడా దక్కలేదు. అడపాదడపా జగన్ పర్యటనల్లో పాల్గొన్న మోదుగుల వేణుగోపాలరెడ్డి గడిచిన ఆరు మాసాలుగా మాత్రం మౌనం పాటిస్తున్నారు.ఈ మౌనం వెనుక.. అసంతృప్తే కారణమని అంటున్నారు మోదుగుల వేణుగోపాలరెడ్డి అనుచరులు. తన సామాజిక వర్గానికి చెందిన నాయకుడే అధికారంలోకి వచ్చినా.. తన పనులు జరగడం లేదని, తనకు గుర్తింపు లేకుండా పోయిందని మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని.. తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.