ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి విధ్వంసక వ్యవస్థ కొనుగోలుకు భారత్ తుది చర్చలు
ఈ ఆర్థిక సంవత్సరంలోనే రష్యాతో రూ.39 వేల కోట్ల డీల్ చేయాలన్న యోచన
శత్రుదేశాల క్షిపణుల ఆటకట్టించే క్షిపణి విధ్వంసక డీల్ తుది దశకు చేరుకుంది. క్షిపణులు, యుద్ధ విమానాలు, స్టెల్త్ ఫైటర్లు, గూఢచర్య విమానాలు, డ్రోన్ల రాకను పసిగట్టి ధ్వంసం చేయగల సత్తా ఉన్న ‘ఎస్-400 ట్రయంఫ్ వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ’లను సమీకరించుకోవడంలో భాగంగా రష్యాతో రూ.39 వేల కోట్ల ఒప్పందాన్ని భారత్ చేసుకోబోతోంది. 400 కిలోమీటర్ల దూరంలోని 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శత్రు దేశ క్షిపణులను ఈ ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి విధ్వంసక వ్యవస్థ నాశనం చేసేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐదు ఎస్-400 కొనుగోళ్లకు సంబంధించి రష్యాతో తుది డీల్‌ను చేసుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది. వాటితో పాటు కమాండ్ పోస్ట్, లాంచర్లు, రాడార్లు, అన్ని భూభాగాల్లో నడిచే ప్రయాణ వాహనాలు, లాంచర్ వెహికిల్స్‌నూ ఒప్పందం అనంతరం రెండేళ్లకు అందించేలా రష్యాతో ఒప్పందం చేసుకోబోతోంది.
‘‘ఈ ఐదు ఎస్-400 వ్యవస్థలు మధ్యస్త బాలిస్టిక్ క్షిపణుల ఆటను కట్టిస్తాయి. అవన్నీ 54 నెలల్లో భారత్‌కు అందుతాయి. తద్వారా దేశ వాయు రక్షణ వ్యవస్థ మరింత పటిష్ఠం అవుతుంది’’ అని రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. చైనా ఆరు ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేసి ట్రయల్స్ చేసిన నేపథ్యంలోనే భారత్ వాటిని రష్యా నుంచి కొనుగోలు చేయాలని భావించింది. అయితే, చైనాకు రష్యా పంపించిన ఎస్-400 వ్యవస్థల విడిభాగాలు తుఫాను కారణంగా గత వారం దెబ్బతిన్నాయన్న కథనాలు ప్రసారమయ్యాయి. ఆ తర్వాత దానిపై ఎలాంటి ప్రకటననూ చేయలేదు చైనా. మరోవైపు భారత్‌కు తమ షార్ట్ రేంజ్ నాజర్ (హత్ఫ్-9)తోనే బుద్ధి చెబుతామని పాకిస్థాన్ బెదిరింపులకు దిగుతున్న తరుణంలో.. దాని పీచమణిచేందుకు ఈ ఎస్-400 వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.