న్యూఢిల్లీ, అక్టోబరు 20
అనంతపురం జిల్లా కలెక్టర్, మరో బాలికపై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రశంసలు కురిపించారు. ఈ నెల 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్‌గా 16 ఏళ్ల ఎం.శ్రావణి బాధ్యతలు నిర్వహించి.. ఒక రోజు కలెక్టర్‌గా రెండు కీలక ఫైళ్లపై సంతకాలు కూడా చేశారు. జవదేకర్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ శాఖలకు అధినేత్రులుగా అమ్మాయిలకు అవకాశం ఇస్తూ జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకున్నారన్నారు. ఓ రైతు కూలీ బిడ్డను కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించడం.. జిల్లా అధికార యంత్రంగా తీసుకున్న ఈ నిర్ణయం బావుందని ప్రశంసించారు. కేంద్రమంత్రి జవదేకర్ ట్వీట్‌పై అనంతపురం జిల్లా యంత్రాంగం ఆనందం వ్యక్తం చేసింది.అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బాలికలకు ఒక రోజు పదవీ బాధ్యతలను అప్పగించారు. ‘బాలికే భవిష్యత్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ ,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా బాలికలు బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌గా కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.శ్రావణి ఎంపికైంది. జిల్లా కలెక్టర్‌గా ఆమె ఒక రోజు బాధ్యతలు స్వీకరించారు.