హైద్రాబాద్, అక్టోబరు 20
రాష్ట్రంలో దసరా వరకు అన్నిపరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. అన్ని ప్రవేశ పరీక్షలతోపాటు యూజీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలను యూనివర్సిటీ వర్గాలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా జేఎన్టీయూ, కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన ఎంబీఏ, డిగ్రీ సెమిస్టర్, బీఈడీ పరీక్షలు సైతం ఇటీవల వాయిదా పడ్డాయి. అక్టోబర్ 19, 20వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయగా.. వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 21న నిర్వహిస్తామని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పరీక్షలను మరోమారు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 31 వరకు గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు