హైద్రాబాద్, అక్టోబరు 21,
కరోనా వైరస్ ఈ ఏడాది మార్చి నుంచి భారత్ ను అతలాకుతలం చేస్తుంది. అన్ని వ్యవస్థలు స్థంభించిపోయాయి. ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతిన్నాయి. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే ఇంకా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రాలేదు. ఈ ఏడాది చివరికి కాని, వచ్చే ఏడాది ప్రారంభంలో కాని కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.అయితే ఇప్పటికే భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 75 లక్షలు దాటేసింది. మరణాలు లక్షకు మించిపోయాయి. అయితే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతుండటం కొంత ఉపశమనం కల్గించే విషయం. కానీ భారత్ లో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ తొలిగిపోయే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలం కావడంతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.యూరప్ వంటి దేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమయింది. దీంతో భారత్ లో కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్ డిసెంబరు లో ఉండే అవకాశముందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే గ్రామాలకు వైరస్ వ్యాప్తి చెందడంతో పాటు వాతావరణం కూడా అని అంటున్నారు. టెస్ట్ ల సంఖ్య ఆశించినంత లేకపోవడం కూడా సెకండ్ వేవ్ కు ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు.యూరప్ లోనూ లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాతనే సెకండ్ వేవ్ ప్రారంభమయిందంటున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం భారత్ లో కరోనా వైరస్ రోజు వారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా అందుకు సంతోషించాల్సిన పనిలేదంటున్నారు. కేసుల సంఖ్య తగ్గినంత మాత్రాన వైరస్ తగ్గినట్లు కాదని, సెకండ్ వేవ్ కు ఇది సంకేతంగా చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు. భారత్ లో లాక్ డౌన్ నిబంధనలను దాదాపు పూర్తిగా సడలించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ పైనే చర్చ జరుగుతోంది.