విజయవాడ, అక్టోబరు 21,
రాజకీయాలైనా.. వ్యక్తిగతమైనా.. కావాల్సింది సమష్టి నిర్ణయం, సమష్టి కృషి. ఇది లోపిస్తే.. ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయనేది వాస్తవం. ఇది.. ఘనత వహించిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఎరుకలో ఉన్నదే. పార్టీలో తీసుకునే కీలక నిర్ణయాలను పార్టీలోని అందరితోనూ చర్చించి తీసుకోవాలనే డిమాండ్ గతంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి వినిపిస్తోంది. ఇక, ఎన్నికల సమయంలో ఈ నినాదం మార్మోగింది. “మీరు ఎవరికి టికెట్ ఇవ్వాలనుకున్నారో.. ముందు చెప్పండి. వారి పరిస్థితి మేం చెబుతాం. మీ సొంతానికి నిర్ణయం తీసుకుని.. గెలిపించాలంటూ.. మా నెత్తిన రుద్దొద్దు“ అని చాలా నియోజకవర్గాల్లో నాయకులు బాబుకు విన్నవించారు.మరీ ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన 23 మంది విషయంలో సగానికి పైగా నేతల విషయంలో ఇదే డిమాండ్ వినిపించింది. అయినప్పటికీ.. చంద్రబాబు ఎవరినీ లెక్కచేయకుండా.. కొద్ది మంది నేతలతో సంప్రదించి.. నిర్ణయాలు తీసుకున్నారు. దీని ఫలితం ఎలా వచ్చిందో తెలిసిందే. మరి గతం నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నామని, మున్ముందు పార్టీలో అందరికీ ప్రాధాన్యం ఉంటుందని, తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల్లో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం కల్పిస్తామని.. చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. తీరా.. సదరు పనుల విషయానికి వచ్చే సరికి మాత్రం ఆయన తన వైఖరిని వీడడం లేదు. తాజాగా ఇప్పుడు కూడా ఇలానే వ్యవహరించడంపై తమ్ముళ్లు నిప్పులు చెరుగుతున్నారు.పార్టీ పురోభివృద్దిలో భాగంగా.. మున్ముందు వైసీపీకి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు పార్లమెంటరీ జిల్లాలకు కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పార్లమెంటు జిల్లాకీ ఒక ఇంచార్జ్‌ని నియమించారు. దీనికి తోడు పార్లమెంటరీ మహిళా కమిటీలను కూడా ఏర్పాటు చేసి.. మహిళలకు పగ్గాలు అప్పగించారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ కాదనలేదు. ఎందుకంటే.. ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీ పుంజుకోవాలనేది వ్యవస్థాగతంగా పార్టీని నమ్ముకున్నవారు కోరుకుంటున్నారు. వైసీపీ స్టయిల్లోనే పదవుల వికేంద్రీకరణ కూడా మంచిదే. అయితే, ఈ నియామకాల్లోనూ చంద్రబాబు ఎవరినీ సంప్రదించకుండానే ఇంచార్జ్‌లను నియమించారు. దీంతో తమ్ముళ్లు ఎక్కడికక్కడ గుర్రుగా ఉన్నారు.మరీ ముఖ్యంగా పార్లమెంటరీ జిల్లా మహిళా కమిటీల నియామకాల్లో.. అప్పటికే జిల్లా మహిళా అధ్యక్షులుగా ఉన్న నాయకులతో చంద్రబాబు సంప్రదించి ఉంటే బాగుండేదని.. వారుకూడా సూచనలు సలహాలు ఇచ్చేవారని అంటున్నారు. కానీ, కొద్ది మంది అంతర్గత నేతలతో జిల్లాలకు సంబంధం లేనివారితో చంద్రబాబు చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల.. తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఇప్పటి వరకు బాధ్యులుగా ఉన్నవారు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా నియామకాలు జరిగే సమయంలో ఒక ప్రొటోకాల్ పాటించడం, సీనియర్లకు వాల్యూ ఇవ్వడం అనేవి ఉంటాయన్నారు.టీడీపీలో ఈ వ్యవస్థను బలోపేతం చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆయనే స్వయంగా దీనిని పట్టించుకోకపోవడం దారుణమని అంటున్నారు. పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకాల్లో పాత జిల్లాల మహిళా అధ్యక్షులను సంప్రదించడం లేదా… కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు ఏ మాత్రం చెప్పకుండానే చాలా చోట్ల నియామకాలు జరిగిపోయాయి. ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడినా చంద్రబాబు తిరిగి అవే తప్పులు చేస్తున్నారనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తుండడం గమనార్హం.