హైద్రాబాద్, అక్టోబరు 21,
రాష్ట్రంలో ఆస్తుల నమోదుకు ప్రభుత్వం పెట్టిన డెడ్లైన్ ముగిసింది. గడువు ముగిసే నాటికి ఊర్లల్లో సుమారు 5 లక్షల ఆస్తులు, మున్సిపాలిటీల్లో 15 లక్షల ఆస్తుల సర్వే మిగిలిపోయింది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 60 శాతం ఆస్తుల నమోదే పూరయింది. జీహెచ్ఎంసీ, దాని చుట్టపక్కల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వర్షాల వల్ల 4 రోజుల క్రితం సర్వే ఆగిపోయింది. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆస్తుల నమోదు గడువును ప్రభుత్వం ఈ నెల 31 వరకు పెంచొచ్చని తెలిసింది.రాష్ట్రంలోని12,765 ఊర్లల్లో 63,30,245 ఆస్తులుండగా మంగళవారం నాటికి 57,84,425 (91.38) ఆస్తుల నమోదు పూర్తయింది. ఇంకా 5,45,820 ఆస్తులను నమోదు చేయాల్సి ఉంది. వీటిలో యజమానులు అందుబాటులో లేని ఇండ్లు, వివాదాల్లో ఉన్న ఆస్తులే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. వీటిలో నల్గొండ జిల్లాలో అత్యధికంగా 48,084 ఆస్తులు, సూర్యాపేట జిల్లాలో 33,640, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 32,813, నాగర్ కర్నూల్ జిల్లాలో 29,512, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 26 వేల చొప్పున, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 25 వేల చొప్పున ఆస్తుల నమోదు మిగిలి ఉంది. ఆస్తుల నమోదులో కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలు ముందున్నాయి. ఈ జిల్లాల్లో 97 శాతం నమోదు పూర్తయింది. 20వ తేదీతో గడువు ముగిసినా గ్రామాల్లో వంద శాతం ఆస్తుల నమోదు పూర్తయ్యే వరకు సర్వే కంటిన్యూ చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 లక్షల ఆస్తులతో పాటు రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో మరో 16 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయని అంచనా. వీటిలో ఇప్పటి వరకు సుమారు 25 లక్షల ఆస్తుల వివరాలే నమోదయ్యాయని, మిగతా 15 లక్షల ఆస్తుల వివరాలు నమోదు కావాల్సి ఉందని తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద ప్రభావం నుంచి ప్రజలు తేరుకునే వరకు సర్వే మళ్లీ ప్రారంభించే అవకాశం కనిపించట్లేదు.