పోలీసు సేవలు స్ఫూర్తిదాయకం
శ్రీకాకుళం
పోలీసు సేవలు నిరుపమానమని, స్ఫూర్తిదాయకమని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా శాసన సభాపతి సీతారాం, జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ తదితరులు అమరులకు ఘనంగా నివాళులర్పించారు. అమర వీరుల జాబితా కలిగిన పుస్తకాన్ని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు. శాసన సభాపతి సీతారాం మాట్లాడుతూ చైనా తెంపరితనంతో వచ్చి దాడులకు పాల్పడిన సమయంలో సరిహద్దుల్లో ఉన్న పోలీసులు వీరోచితంగా పోరాడి అసువులు బాసారన్నారు. అందరం కంటి నిండా నిద్ర పోతున్నాం అంటే పోలీసులు, భద్రతా దళాలు కారణం అన్నారు. పోలీసుల సేవలను ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు. పోలీసుల గురుతరమైన బాధ్యత నిర్వహణలో తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకొనుటకు సూచనలు ఇవ్వాలని అన్నారు. పోలీసులు ఎప్పుడు కంట నీరు పెట్టరాదని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కోవిడ్ విధుల నిర్వహణకు ముందుకు వచ్చిన వారిలో పోలీసులు ఉన్నారని ఆయన తెలిపారు. పోలీసుల సేవలకు ప్రజలు, ప్రభుత్వం తరపున అభినందించారు. ఐపీఎస్ అధికారులు వ్యాస్, పరదేసి నాయుడు, ఉమేష్ చంద్ర వంటివారితో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్.ఐ బంగారు నాయుడు, ఏ.ఎస్.ఐ వెంకట రమణ సేవలు మరువలేనివని అన్నారు. పోలీసులకు కుటుంబం ఉంటుంది, కానీ పండగలు, పబ్బాలు లేకుండా రోడ్ల మీద ఉంటారని అన్నారు. విధుల పట్ల అంకిత భావం గొప్పదని పేర్కొన్నారు. పోలీసుల సేవలు సరైన విధానంలో బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. పోలీసుల అసాధారణ సేవలను పాత్రికేయులు గుర్తించి సమాజాన్ని ఉత్తేజ పరిచే విధంగా కథనాలను ప్రచురించాలని కోరారు. పోలీసులు మానవత్వంతో పనిచేస్తున్నారని, పోలీసులకు, వారి కుటుంబాలకు ఆదరాభిమానాలతో, అండగా ఉందామని పిలుపునిచ్చారు.
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ పోలీసుల సేవలు అపారమన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడటంలో విశేష సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ పోలీసులు ఉత్తమ విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టిన రోజు అమర వీరుల దినోత్సవం అన్నారు. మాజీ పోలీసు అధికారిగా పోలీసు విధుల పట్ల అనుభవం ఉందని పేర్కొన్నారు. ప్రజల కోసం ఎంతో కష్టపడిన వ్యవస్థను చూసానని అన్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి విధులకు హాజరు కావలసి ఉంటుందని ఆయన చెప్పారు. ఎప్పుడు తింటారో, ఎప్పుడు పడుకుంటారో తెలియదని, కేసులు, ప్రమాదాలు వచ్చినపుడు పరిస్థితి మరింత జఠిలంగా ఉంటుందని అన్నారు. పోలీసులు మన కోసం సేవలు అందిస్తున్నారని తెలిపారు. కరోనా కాలంలో లాక్ డౌన్ లో విధులకు వచ్చిన మొదటి బృందం పోలీసులని కొనియాడారు. కోవిడ్ లో ప్రజల ప్రాణాలు కాపాడారని అన్నారు. రాబోయే కాలంలో పోలీసు, రెవెన్యూ శాఖలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరిన్ని మంచి సేవలు అందిద్దామని పిలుపునిచ్చారు. అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ స్ఫూర్తి దాయక సేవలు అందించాలని కోరారు.
పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ ఈ ఏడాది 265 మంది పోలీసులు అసువులుబాసారన్నారు. అమర వీరుల నుండి స్ఫూర్తి పొందుతామని ఆయన పేర్కొన్నారు. నిస్వార్ధ సేవలు అందించే వృత్తి పోలీసు వృత్తి అన్నారు. కోవిడ్ 19లో అత్యంత ఉత్తమ సేవలు అందించారని పేర్కొన్నారు. మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా ఉత్తమ సేవలను ప్రజలకు అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా అమరులైన జిల్లా పోలీసు కుటుంబాలకు సత్కరించారు. అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించారు. అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పోలిసులు హాజరయ్యారు