విజయవాడ, అక్టోబరు 22,
స్థానిక ఎన్నికల వివాదం ఎటు మలుపు తీసుకుంటుంది. జగన్ కోరుకున్నట్టు వచ్చే ఏడాది వరకు ఎన్నికలు జరగకుండా చూసే అవకాశం ఉందా ? ప‌్రస్తుత పరిస్థితిలో ఆయన స్థానిక ఎన్నికలను నిలువరించగలరా ? లేక.. స్థానిక ఎన్నికలకు త్వరలోనే గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందా ? అదే సమయంలో స్థానిక ఎన్నికలు మళ్లీ మొదటికి వస్తాయా ? ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఇవే ప్రశ్నలు హల్ చల్ చేస్తున్నాయి. దీనికి కారణం.. స్థానిక ఎన్నికలపై మీ వ్యూహం ఏంటి ? అని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ప్రశ్నించింది. అయితే, ఈ విషయంలో అన్యాపదేశంగా జోక్యం చేసుకున్న ప్రభుత్వం.. కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని చెప్పింది.అయితే, అక్కడితో హైకోర్టు ఆగిపోయి ఉంటే వేరేగా ఉండేది. ఈ విషయం రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పాలని పేర్కొంటూ.. ప్రస్తుత కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కోర్టులోకి ఎన్నికల బంతిని విసిరింది. దీంతో ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయం.. అనంతరం .. కోర్టు ఇచ్చే తీర్పు.. తీవ్ర ఉత్కంఠ భరితంగా ఉన్నాయనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడున్న పరిస్థితిలో బిహార్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున స్థానిక ఎన్నికల విషయంలో కమిషనర్ పచ్చజెండా ఊపే అవకాశంఉంది.అదే సమయంలో ఎప్పుడో జరిగిన ఏకగ్రీవాలను కూడా రద్దు చేస్తూ.. మొత్తం మళ్లీ మొదటికి తెచ్చే అవకాశం కూడా కనిపిస్తోందని అంటున్నారు అత్యంత విశ్వసనీయ వర్గాలకు చెందిన వారు. అంటే.. ఇప్పటి వరకురాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఏకగ్రీవాలన్నీ కూడా రద్దయి.. మళ్లీ మొదటికి వస్తాయి. ఇది తీవ్ర ఇరకాటమేనని వైసీపీ అధినేత దీనిని ఎలా ఎదుర్కొంటారో కష్టమేనని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితి వైసీపీ మంత్రులు, నేతలపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో మూడు రాజధానుల ప్రభావం కూడా కనిపిస్తోంది.ఇక, అనేక పథకాలు కూడా నిలిచిపోయాయి. దీంతో ఇప్పుడు ఆది నుంచి కనుక ఎన్నికలు జరిగితే.. ఏకగ్రీవాలు రద్దయితే.. వైసీపీకి ఇబ్బందేనన్నది పరిశీలకుల మాట. మొత్తంగా చూస్తే.. ప్రస్తుతం అంతా కూడా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ నిర్ణయంపైనే ఆధారపడిందని.. అటు తిరిగి ఇటు తిరిగి.. మళ్లీ ఆయనే కీలకంగా మారారని.. ఏం చేస్తారో చూడాలని అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలో టెన్షన్.. టెన్షన్ వాతావరణం ఉందని అంటున్నారు