తిరుపతి, అక్టోబరు 22,
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబుపై నేతలు వత్తిడి తెస్తున్నారు. గెలుపోటములు పక్కన పెట్టి పోటీ చేయాల్సిందేనని తెలుగు తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఆరు నెలల్లో జరిగే అవకాశముంది. అయితే ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు చంద్రబాబు పెద్దగా ఇష్టపడటం లేదు. తన సొంత జిల్లా కావడం, దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉండటం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు.సిట్టింగ్ ఎంపీ దుర్గా ప్రసాద్ చనిపోవడంతో జరుగుతున్న ఎన్నిక కావడంతో గత సంప్రదాయాలను పాటిస్తూ దూరంగా ఉండాలని చంద్రబాబు తొలుత భావించారు. కానీ రాష్ట్రంలో సంప్రదాయాలకు కాలం చెల్లిందని సీనియర్ నేతలఅభిప్రాయం. సొంత జిల్లాలో పోటీ చేయకపోతే క్యాడర్ లోకి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతామని చంద్రబాబుకు సీనియర్ నేతలు చెబుతున్నట్లు తెలిసింది. ఇక్కడ గెలుపోటములను పక్కన పెట్టి పోటీ చేయాల్సిందేనని కొందరు పట్టుబడుతున్నారు.ముఖ్యంగా తిరుపతి, సర్వేపల్లి, గూడూరు వంటి అసెంబ్లీ నియోజకవర్గాల నేతల నుంచి చంద్రబాబుకు అధిక సంఖ్యలో వినతులు అందుతున్నాయి. అభ్యర్థి ఎవరైనా కలసికట్టుగా పనిచేస్తామని వారు చంద్రబాబుకు పదే పదే చెబుతున్నారు. దీంతో తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. మృతి చెందిన దుర్గాప్రసాద్ ఎక్కువ కాలం టీడీపీలోనే ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులపై పోటీ పెట్టడం ఎందుకని చంద్రబాబు భావించినా తమ్ముళ్ల వత్తిడికి తలొగ్గక తప్పడం లేదు.అయితే తిరుపతి ఉప ఎన్నికల బరిలో ఎవరిని పోటీకి దింపాలన్నది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను చంద్రబాబు తీసుకోనున్నారు. అయితే పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య పేరు చంద్రబాబు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల బలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి వర్లరామయ్య పార్టీ పట్ల తన నిబద్దతను చాటుకున్నారని, ఆయనకే ఈ అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికలో పోటీచేసేందుకు టీడీపీ సిద్దమయిందనే చెప్పాలి.