YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ వైపు చూడ‌ని టాలీవుడ్ జ‌నం

ఏపీ వైపు చూడ‌ని టాలీవుడ్ జ‌నం

విజ‌య‌వాడ‌, అక్టోబ‌రు 22, 
విభజన ఇది అని ప్రతీ ఆంధ్రుడూ ఇప్పటికీ బాధపడని రోజు లేదు. అయినా సరే రెండు ముక్కలు చేశారు. మీకు కూడా భాగ్యనగరం మాదిరి రాజధానిని కట్టి చూపిస్తామని ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా అని కూడా తీయని మాటలు చెప్పారు. చివరికి మిగిలింది ఏంటి అంటే అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్. ఇప్పటికి రెండు ప్రభుత్వాలు మారాయి. రాజధాని విషయం మాత్రం ఒక కొలిక్కి రాలేదు. మరో వైపు చూస్తే సీజనల్ గా వచ్చే తుఫాన్లతో తీర ప్రాంత రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ అల్లల్లాడుతోంది. ఈసారి ఆంధ్రా వరదలతో వేల కోట్ల రూపాయల అతి భారీ నష్టమే సంభవించింది. ఇక కేంద్ర సాయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చిత్రమేంటంటే వరదలు వస్తే ప్రతీసారి ఆంధ్రప్రదేశ్ గురించే అంతా మాట్లాడుకునేవారు. కానీ ఇపుడు మాత్రం హైదరాబాద్ గురించే ఎక్కడ చూసినా చర్చ వస్తోంది. దానికి కారణం డక్కన్ పీఠభూమి మీద నిర్మించిన నగరం అది. సముద్ర తీరం వద్ద లేదు. కానీ వరదలు వచ్చి నగరాన్ని ముంచేశాయంటే అది పెద్ద చర్చగానే ఉంది. అయితే ఇలా ఎందుకు జరిగింది అంటే కచ్చితంగా మానవ‌ తప్పిదమే అని అంటున్నారు. అక్రమంగా చెరువులు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన పాపానికి ఇది ప్రతిఫలం అని అంటున్నారు. సరే ఏ విధంగా జరిగినా హైదరాబాద్ వదలతో సామాన్యుడు మునిగాడు, ఇది జాతీయ స్థాయిలో హైలెట్ అయింది. అందుకే ఎపుడూ ఏడ్చే ఆంధ్రప్రదేశ్ బాధ ఎవరికీ కనిపించకుండా పోయింది అదేం ప్రారబ్దమో తెలియదు కానీ టాలీవుడ్ చూపు ఎపుడూ ఒక వైపే ఉంటోంది. ఆరేళ్ళ క్రితం వరకూ ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది. ఇపుడు రెండుగా మారింది. కానీ టాలీవుడ్ స్థిరపడింది తెలంగాణాలో. దాంతో మొహమాటాలు, అవసరాలు ఇవన్నీ కలసి సినీ పెద్దల నోట జై టీఆర్ఎస్ అని తరచూ వస్తోంది. అదే సమయంలో ఆంధ్రా విషయంలో మాత్రం ఫక్త్ రాజకీయమే నడుపుతున్నారు. సినీ పెద్దల్లో టీడీపీ సామాజికవర్గం వారు అత్యధికులు. అలాగే మరో కొత్త పార్టీకి చెందిన వారు కూడా అప్పర్ హ్యాండ్ గా ఉన్నారు. దాంతో ఏపీకి పైసా సాయం చేయాలన్నా ఈ రాజకీయ లెక్కలేవో అడ్డు వస్తున్నాయిలా ఉంది. దాంతో కేవలం తెలంగాణకు మాత్రమే విరాళాలు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. ఇది ఇవాల్టి కధ కాదు, కరోనా సమయంలో కూడా మన వెండితెర వేలుపులు ఇలాగే చేశారన్న విమర్శలు ఉన్నాయి.చిత్రమేంటంటే టాలీవుడ్ మొత్తానికి మొత్తం ఆంధ్రా మూలాలు ఉన్న వారే. తమ సొంత గడ్డ మీద వరద కోత కోసి కన్నీరు మిగిల్చిందని తెలిసి కూడా సాయం అందించడానికి చేతులు రావడం లేదు అంటే ఇందులో రాజకీయమే ఉందని అంటున్నారు. ఏపీ సీఎం జగన్ కి టాలీవుడ్ మద్దతు మొదటి నుంచి తక్కువ. ఎన్నికల ముందు కొంతమంది ఇటు చేరినా పదవులు ఇవ్వకపోయేసరికి ఫుల్ సైలెంట్ అయ్యారు. ఇక ఉన్న చోట మంచి చేసుకోవాలన్న ముందు చూపుతోనే అక్కడ భూరి విరాళాలు ప్రకటించారని విశ్లేషణలు ఉన్నాయి. కానీ విషయమేంటంటే ఆంధ్రాలోనే ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ నుంచే రికార్డు కలెక్షన్లూ కురుస్తున్నాయి. మరి ఆ సంగతి మరచి వరసపెట్టి ఇలా వివక్ష చూపిస్తే కనుక ఆంధ్రులు ఎలా రియాక్ట్ అవుతారో ఊహించడం కష్టమే. అపుడు గుండెలు బాదుకున్నా ఉపయోగం లేదన్నది కూడా సినీ పెద్దలు గుర్తించాలి.

Related Posts