న్యూఢిల్లీ, అక్టోబరు 22,
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక యుద్ధం చేస్తున్నారు. దాన్ని మధ్యలోనే ఆపేసే సీన్ కూడా ఇపుడు లేదు. ఎందుకంటే ఇది పులి మీద స్వారీ. ఆయన ఏకంగా న్యాయ వ్యవస్థ పనితీరు మీదనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అది కూడా తన వారి చేత మీడియా మీటింగ్ పెట్టించి మరీ జనబాహుళ్యంలో కొత్త చర్చకు తెర లేపారు. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ దీనికి లాజికల్ కంక్లూషన్ కోసం చూస్తున్నారు. తనకు న్యాయం కావాలని కూడా గట్టిగా కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తన ముందు ఉన్న అన్ని రకాలైన ఆప్షన్స్ ని ఆయన వాడుకోవాలనుకుంటున్నారు. జగన్ సాధారణంగా ఢిల్లీ టూర్లు ఎక్కువగా పెట్టుకోరు. ఈ విషయంలో ఆయనకు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఆదర్శమని అంటారు. అనవసరంగా హస్తిన చుట్టూ చక్కర్లు కొట్టడం వల్ల ఉపయోగం లేదని కూడా నమ్ముతారు. పాలన చేయాల్సింది రాష్ట్రంలో. అందుకే ఆయన ఏపీలోనే ఉంటారు. కానీ ఇపుడు మాత్రం ఆయన మరో మారు ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నారుట. అది కూడా తాను లేవనెత్తిన న్యాయ పరమైన అంశాల మీద కేంద్ర పెద్దలకు మరో మారు వివరించాలని అనుకుంటున్నారుట. ఈ విషయంలో ఆయన ప్రధానితో పాటు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూదా కోరారని అంటున్నారు.రాష్ట్రపతిని నడిచే రాజ్యాంగంగా చెబుతారు. ఆయనకు మరో పేరు రాజ్యాంగ పరిరక్షకుడు. అన్ని వ్యవస్థలను కాపాడేది రాష్ట్రపతి మాత్రమే. అందుకే ఆయన్ని నేరుగా కలసి ఏపీలో తమ ప్రభుత్వానికి దొరకని న్యాయం గురించి జగన్ ఏకరువు పెట్టాలనుకుంటున్నారుట. రామ్ నాధ్ కోవింద్ తో భేటీ కోసం జగన్ తయారుగా ఉన్నారని కూడా భోగట్టా. ఆయన కనుక రమ్మని కోరితే క్షణాల్లో వాలి ముందు నిలవాలని కూడా జగన్ ప్లాన్ వేసుకున్నారని తెలుస్తోంది. ఆయకు తన గోడు వెళ్లబోసుకోవడమే కాదు, ఏపీలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను కూడా వివరించాలని జగన్ భావిస్తున్నారుట.ముందే చెప్పుకున్నట్లుగా రాష్ట్రపతి రాజ్యాంగ రక్షకుడు. ఆయనకు జగన్ ఏపీలో పరిణామాలు వివరించినట్లు అయితే కొంత సానుకూలత లభిస్తుంది అని ఆశిస్తున్నారుట. ఇక ఏపీలో పాలనాపరంగా విధానపరమైన అనేక నిర్ణయాల అమలుకు ఎలా ఇబ్బందులు ఎదురవుతున్నాయో కూడా వివరిస్తారు అంటున్నారు. అలాగే తమ ప్రభుత్వం తీసుకున్న అసాధారణ నిర్ణయం గురించి కూడా జగన్ రాష్ట్రపతికి తెలియచెబుతారని అంటున్నారు. ఏ పరిస్థితులలో తాను ఈ విధంగా ఒక సీనియర్ న్యాయమూర్తికి వ్యతిరేకంగా లేఖ రాయాల్సివచ్చిందో కూడా చెబుతారని అంటున్నారు. మొత్తానికి జగన్ ఢిల్లీ యాత్ర మాత్రం కన్ ఫర్మ్. అయితే అది రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇచ్చే దాని మీదనే ఆధారపడిఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో