ముంపు బాధితులకు నిత్యవసరాల పంపిణీ
కాకినాడ
రాష్ట్ర వ్యాప్తంగా వరద కారణంగా ముంపునకు గురైన కుటుంబాలను ఆదుకునేలా అయిదు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం గ్రామీణ మండలం స్వామినగర్‌లో ముంపునకు గురైన బాధిత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత, జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీశ, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని, సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి అన్నారు. ఏలేరు కాలువ, ఇతర డ్రైనేజీలు పొంగి ప్రవహించడంతో కాలనీలోకి నీరు చేరింది అని మంత్రి తెలిపారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించి సుమారుగా 40 కాలనీలలోకి వరద నీరు చేరిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక శిబిరాలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రజలు ఇబ్బందులు గురికాకుండా మూడు పూటలా భోజనం, తాగునీరు ఇతర అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ముంపునకు గురైన బాధిత ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో 25 కేజీల బియ్యం, కందిపప్పు ,పామాయిలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కేజీ చొప్పున అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. నీటమునిగిన కాలనీలు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సీఎం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు వరద తగ్గిన వెంటనే అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామినగర్‌లో ఉన్న మురికి డ్రైనేజీ నిర్మాణం నిమిత్తం రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ నిర్మాణం , లోవోల్టేజ్ సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ముంపు బాధిత ప్రజలను తక్షణమే ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయిదు రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. జేసి లక్ష్మీశ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం జిల్లాలో వరద ప్రభావానికి గురైన సుమారు 25 వేల కుటుంబాలకు అయిదు రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అనంతరం మంత్రి, ఎంపీ, జేసీ, కమిషనర్ చేతుల మీదుగా వరద బాధిత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కోరాడ దుర్గా ప్రసాద్ రెడ్డి, గీసాల శ్రీనివాసరావు, కరాటే రాము, కాకినాడ ఆర్‌డీవో ఎజీ చిన్నికృష్ణ, అర్బన్ తహసీల్దార్ వై హెచ్ ఎస్ సతీష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.