పది ఎర్రచందనం దుంగలతో పాటు, ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు
తిరుపతి
రంగంపేట సమీపంలోని శేషాచలం అడవుల్లో అక్రమ రవాణా చేస్తున్న పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాలు మేరకు డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఐ లింగాధర్, డీఆర్వో పివి. నరసింహ రావు టీమ్ బుధవారం సాయంత్రం నుంచి అలిపిరి-రంగంపేట మార్గంలో కూంబింగ్ చేపట్టారు. గురువారం ఉదయం నాగపట్ల ఈస్ట్ బీట్ చామల రేంజ్ లోని విద్యానికేతన్ ఎదురుగా రెండు కిలోమీటర్ల దూరం లోని అటవీ ప్రాంతంలో దాదాపు 11 మంది ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. వారిపై దాడి చేయగా ఇద్దరు పట్టుబడ్డారు. మిగిలిన వారు దుంగలను వదిలి పారిపోయారు. పట్టుబడిన వారిని వెల్లి ఇళయరాజ్ (25), పలని రాజ్ (40) లుగా గుర్తించారు. వీరు తమిళనాడు లోని కళ్లకురిచ్చికి చెందిన వారు. వీరిని అరెస్ట్ చేయగా టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ సిఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.