YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

*ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్*

*ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్*

*కోవిడ్-19 తీవ్రత తగ్గినా నిర్లక్ష్యం వద్దు- వైరస్ పట్ల అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉందాం*
దేశ వ్యాప్తంగా, ఇటు మన రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కోవిడ్ ప్రారంభ దశలో ఉన్నంత తీవ్ర ప్రభావం ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో ప్రజలు కూడా కోవిడ్ సోకినా వైద్యులను సంప్రదించి ఇంట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కోవిడ్ తీవ్రత తగ్గిందన్న భావనలో ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం తగిన మూల్యం తప్పదని ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ కూడా హెచ్చరించారు. కోవిడ్ ప్రభావం నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోలేదని.. ప్రజలు ఇప్పటికీ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 ఎలా వ్యాపిస్తుంది? ఇతరుల నుంచి వైరస్ మనకు సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైరస్ లక్షణాలు ఏంటి? ఒకవేళ వైరస్ లక్షణాలు కనిపిస్తే ఎవరికి సమాచారం ఇవ్వాలి? ఎక్కడ సంప్రదించాలన్న విషయాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రజలు వీటిని తెలుసుకుని మరింత మందికి తెలియజేయడం ద్వారా కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నిద్దాం.
*1. కోవిడ్-19 లక్షణాలైన దగ్గు, జలుబు, రుచి, వాసన కోల్పోవడం, జ్వరంతో బాధపడుతూ ఉన్నట్టయితే ఎవరికి తెలియజేయాలి*?
జ. మీరు నివసిస్తున్న ప్రాంతానికి సంబంధించిన ఆరోగ్య కార్యకర్తలకు గానీ లేదా వార్డు/గ్రామ వాలంటీర్లకు వెంటనే తెలియజేయాలి. వారు మీ ఇంటికి వచ్చి మీ ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి మీకు కోవిడ్-19 పరీక్ష చేయుటకు ఏర్పాట్లు చేస్తారు.
*2. ఒకవేళ కోవిడ్ పరీక్షలో పాజిటివ్ అని నిర్ధారించినట్టయితే ఏమి చేయాలి*?
జ. ముందుగా కంగారు పడకుండా ధైర్యంగా ఉండాలి. కుటుంబ సభ్యులతోగానీ ఇతరులతో కానీ కలవకుండా భౌతిక దూరం పాటించాలి. తప్పనిసరిగా మాస్కు ధరించాలి. ఇంట్లో ఏవస్తువును తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంటిలో 60 సంవత్సరాలు పైబడినవారు, పిల్లలు గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే వారికి దూరంగా ఉండాలి. వారికి కూడా పరీక్షలు నిర్వహించే వరకు విడిగా ఉండవలెను.
*3. కోవిడ్-19 నిర్ధారణ తర్వాత ఏం చేస్తారు* ?
జ. కోవిడ్-19 సోకిన వ్యక్తిని దగ్గరలోని ఆసుపత్రి వద్ద ఆరోగ్య కార్యకర్తలు లేదా మండల స్థాయి ఆరోగ్య కేంద్రం అధికారులు పరీక్షలు నిర్వహిస్తారు.
*4. ఎటువంటి పరీక్షలు నిర్వహిస్తారు* ?
జ. కోవిడ్ సోకిన వ్యక్తికి రక్త పరీక్షలు, ఎక్స్ రే, శ్వాస పరీక్షలు మొదలగునవి చేసి వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తారు.
*5. పరీక్షల అనంతరం ఏం చేస్తారు* ?
జ. వ్యాధి సోకిన ప్రతి 100 మందిలో సుమారు 75 మందికి ఎటువంటి లక్షణాలు ఉండడం లేదు. అలాంటి వారు ఇంటి వద్దనే పదిరోజులు స్వీయ నిర్బంధంలో ఉంటూ వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించాలి. ఒకవేళ వైరస్ తీవ్రత అధికంగా ఉండడం, ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండే పరిస్థితి లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్స్ లేదా కోవిడ్ ఆస్పత్రులకు తరలించడం జరుగుతుంది.
*6. హోమ్ ఐసోలేషన్ పై ప్రజల్లో ఉన్న అపోహలు ఎలా నివృత్తి చేస్తారు* ?
జ. ముందుగా ప్రజలు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. ఈ వ్యాధి ఇప్పటికిప్పుడే అంతరించి పోదు. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు పాటించాలి. అదేవిధంగా ఈ వ్యాధి సోకిన ప్రతి ఒక్కరికి హాస్పటల్లో చికిత్స అవసరం లేదు అనేది గుర్తించాలి. వ్యాధి లక్షణాలు లేనివారు ఇంటి వద్దనే ఉండి చికిత్స పొందాలి.
*7. వ్యాది సొకిన వ్యక్తి పట్ల ఇరుగు పొరుగు వారి భయాలు ఎలా ఉంటాయి* ?
జ. కోవిడ్ వ్యాధి సోకిన వ్యక్తి యొక్క ఇరుగు పొరుగు వారు భయపడడం సహజమే. కానీ ఇంటిలోని వారు ఇరుగు పొరుగు వారు మానసికంగా సిద్ధపడాలి. రేపు మీకు కూడా కరోనా రావచ్చు. అలా అని ప్రతి ఒక్కరిని వెలివేయడం సమంజసం కాదు. ఇది ఒక తరహా ఫ్లూ లాంటిది. వస్తుంది పోతుంది అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. వ్యాధిగ్రస్తుని పట్ల సానుకూల దృక్పథం అలవాటు చేసుకోవాలి.
*8. హోం ఐసోలేషన్ ఉండాలంటే వారి గృహంలో ఎలాంటి సదుపాయాలు ఉండాలి* ?
జ. ఇంట్లో ప్రత్యేక గది మరియు మరుగుదొడ్డి ఉండాలి. ఒకవేళ ఒకే మరుగుదొడ్డి ఉంటే వ్యాధిగ్రస్తుడు వాడిన అర్ధగంట తరువాత ఇతరులు వాడుకోవచ్చు. బట్టలు ఉతికే డిటర్జెంట్ పౌడర్ తో మరుగుదొడ్డి శుభ్రం చేస్తే సరిపోతుంది.
*9. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యాధిగ్రస్తుడితో ఎవరు ఉండవచ్చు* ?
జ. ఇంట్లో వృద్ధులు, చిన్నపిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు ఉన్నట్టయితే వారిని వేరే గృహంలో గానీ, ప్రత్యేక రూమ్ లో గానీ ఉంచాలి. వ్యాధిగ్రస్తునికి సపర్యలు చేయుటకు ఒక వ్యక్తి ఉంటే సరిపోతుంది.
*10. సపర్యలు చేయు వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి* ?
జ. ఎల్లప్పుడూ మాస్కు ధరించాలి. వైరస్ సోకిన వ్యక్తి యొక్క వస్తువులను బట్టలను తాకరాదు. ఒకే గదిలో ఉండాల్సి వచ్చినప్పుడు ఒకరికొకరు రెండు మీటర్ల దూరాన్ని పాటించాలి.
*11. ఈ వ్యాధి సోకిన వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి* ?
జ. ముందుగా వ్యాధి తీవ్రత లేదు కాబట్టే ఇంటిలో ఉండమన్నారు అని తెలుసుకోవాలి. ఎప్పుడు సెల్ ఫోను అందుబాటులో ఉంచుకోవాలి. ఆరోగ్య సేతు యాప్ ను డౌన్లోడ్ చేసుకుని లొకేషన్, బ్లూటూత్ ఆన్ చేసి ఉంచాలి. ఆరోగ్య కార్యకర్తలు సూచించే మందులు వాడాలి. తేలికపాటి వ్యాయామాలు ధ్యానం చేయాలి. బట్టలు, మరుగుదొడ్డితోపాటు ఎవరి గదిని వారే శుభ్రం చేసుకోవాలి. అతను ఉపయోగించిన పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
*12. హోం ఐసోలేషన్ లో ఎన్ని రోజులు ఉండాలి* ?
జ. జ్వరం గాని ఇతరత్రా ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేనట్టయితే పది రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్నట్లుగా భావించవచ్చును. 14 రోజుల తర్వాత అతను దైనందిన కార్యక్రమాలను చేసుకోవచ్చు.
*13. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తికి అనారోగ్య సమస్యలు తలెత్తితే ఏం చేయాలి* ?
జ. జిల్లా కేంద్రంలోని కంట్రోల్ సెంటర్లో వీరి పేర్లు ఫోన్ నెంబర్లు నమోదు అయి ఉంటాయి. ఒకవేళ ఏదైనా అనారోగ్య పరిస్థితి, అత్యవసరమైన చికిత్స అవసరమైతే 104 కాల్ సెంటర్ కి ఫోన్ చేసిన వెంటనే మెరుగైన చికిత్స కొరకు ఆస్పత్రికి తరలించ బడును. అధైర్య పడవలసిన అవసరం లేదు.
*14. హోం ఐసోలేషన్ అనంతరం పరీక్షలు అవసరమా* ?
జ. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని ఎడల మరలా వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదు.
*15. ఎటువంటి ఆహారం తీసుకోవాలి* ?
జ. బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. శాఖాహారులయితే పప్పు ధాన్యాలు, పాలు, పండ్లకు  ప్రాధాన్యతనివ్వాలి. మాంసాహారులు పాలు, పండ్లు, గుడ్డు, చికెన్, మటన్, చేపలు ఆహారంగా తీసుకోవచ్చును.
*16. హోమ్ ఐసోలేషన్ వారిపట్ల ప్రజల్లో ఉన్న అపోహలను ఎలా నివృత్తి చేస్తారు* ?
జ. హోమ్ ఐసోలేషన్ అన్నది తప్పనిసరి అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి.  ఈ వ్యాధి సోకిన వ్యక్తి పట్ల వివక్ష చూపకూడదు. మనం పోరాడాల్సింది కరోనాతో, వ్యక్తితో కాదు అనే నినాదాన్ని తూచా తప్పక పాటించాలి. స్వీయ రక్షణ చర్యలు పాటించాలి. మాస్కు ధరించాలి. అవసరమైతే తప్ప బయటకి రాకూడదు.
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
*కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్*
 

Related Posts