ఏపీలో సీఎం బాబు గ్రాఫ్ డౌన్ అవుతోందా...అంటే ఔననే సమాధానమే వస్తోంది. వరుసగా పదేళ్లు ఏపీలో చక్రం తిప్పుదామనుకుంటున్న నారా వారికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఆనం కుటుంబం పార్టీని వీడటం సైకిల్ పార్టీకి కోలుకోలేని దెబ్బే. ఆనం సోదరుల్లో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు నాడు మాట ఇచ్చారని... రామనారాయణకు ఎమ్మెల్సీ పదవి కోసం స్వయంగా వివేకా అనేకసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినా ఫలితం లేకపోవడంతో టాటా చెప్పేస్తున్నారు.దీంతో నిన్న మొన్నటి వరకూ చేరికలతో పసుపు పార్టీ శోభాయమానంగా ఉండగా, తాజాగా వలసలతో డీలా పడిపోతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కూడా కొంత కారణమంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తాను అనుకున్న దొకటి…జరుగుతున్నదొకటిలా మారింది. కొత్త రాష్ట్రాన్ని కనీసం దశాబ్దం పాటు పాలిద్దామని, అందుకు అనుగుణంగా 2014 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అన్ని రకాలుగా కష్టాల్లో ఉన్న నవ్యాంధ్రను తీర్చిదిద్దాలంటే తన నాయకత్వం, సమర్థతే ఏపీ ప్రజలకు దిక్కని భావించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను చేర్చుకున్నారు. భవిష్యత్లులో జరగబోయే రాజకీయ పరిణామాలను చంద్రబాబు ఊహించలేకపోయారు. దీంతో ఎన్నికలకు ఏడాది ముందే టీడీపీ నుంచి వికెట్లు ఒక్కొక్కటిగా బయటపడుతుండటం, అధినేతపై అసంతృప్తులు బహిరంగంగా వెళ్లగక్కుతుండటం పార్టీ పరిస్థితికి అద్దం పడుతుంది.మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకమాట అన్నారు. పెద్దాయన ఎందుకు అన్నారో గాని ఆ మాటలు నిజమవుతున్నాయి. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకుంటే ఎప్పటికైనా ఇబ్బందులు ప్పవని గోరంట్ల ఆనాడే హెచ్చరించారు. అయితే నియోజకవర్గాలు పెరుగుతాయన్న ధీమాతో చంద్రబాబు పార్టీ గేట్లు ఎత్తివేశారు. వచ్చిన వారికి వచ్చినట్లు కండువాలు కప్పేశారు. 2014 ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చెప్పారు. అయితే ఎంతకూ ఇవ్వకపోవడంతో పార్టీలో ఉండేది లేదని ఆయన తెగేసి చెప్పారు.ఇటీవల నామినేటెడ్ పదవి ఇచ్చినా తనకు వద్దు పొమ్మంటూ ఆయన కూడా పార్టీ వీడేందుకు సిద్ధమయిపోయారు. టీడీపీ నేతలు బుజ్జగిస్తున్నా పెద్దగా ఫలితం కన్పించడం లేదు.నెల్లూరు జిల్లాలోని ఆనం కుటుంబం పార్టీని వీడటం సైకిల్ పార్టీకి కోలుకోలేని దెబ్బేనని చెప్పొచ్చు. ఆనం ఫ్యామిలీ తొలినాళ్లలో తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. తర్వాత టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ లో దాదాపు పదేళ్ల పాటు నెల్లూరు జిల్లాను తమ అదుపాజ్ఞల్లో పెట్టుకున్నారు. అయితే ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర విభజనతో జగన్ పార్టీలోకి వెళ్లకుండా టీడీపీలో చేరిపోయారు. ఆనం సోదరుల్లో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు నాడు మాట ఇచ్చారంటున్నారు. రామనారాయణకు ఎమ్మెల్సీ పదవి కోసం స్వయంగా వివేకా అనేకసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చించారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు ఉండటంతో ఇవ్వడం కుదరదని చెప్పేశారు.ఆనం రామనారాయణరెడ్డి కూడా పార్టీని వీడే పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోకుంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఉండరనేది వాస్తవం. పార్టీని కొన్నేళ్లుగా నమ్ముకున్న వారైతే పదవి దక్కకపోయినా భరిస్తూ మౌనంగా ఉంటారు. కాని ఇతర పార్టీల నేతలు మాత్రం ఉండరనేది అందరికీ తెలిసిన సత్యమే. ఎన్నికలకు ముందు పార్టీని పెద్ద స్థాయి నేతలు వీడుతుండటం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఆందోళనలో సైకిల్ పార్టీ నేతలున్నారు. నిన్న మొన్నటి వరకూ చేరికలతో పసుపు పార్టీ శోభాయమానంగా ఉండగా, తాజాగా వలసలతో డీలా పడిపోతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కూడా కొంత కారణమంటున్నారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపర్చకపోవడం, రాజధాని నిర్మాణం చేపట్టకపోవడం, ప్రత్యేక హో్దా విషయంలో యూటర్న్ తీసుకోవడంతో బాబు గ్రాఫ్ తగ్గిందని భావించిన నేతలు పక్క చూపులు చూస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద రానున్న రోజుల్లో మరెంత మంది పార్టీని వీడతారోనన్న ఆందోళన ఆపార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.