విశాఖపట్టణం, అక్టోబరు 24,
వైసీపీలోకి వెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని చూస్తే అర్ధం అవుతుంది. ఇక్కడ కేంద్ర స్థాయిలో నేతలను కలుస్తారు. అంతా ఓకేగా ఉంటుంది అనుకుంటారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం మనసులు కలవవు. మాటల యుధ్దాలతో ఒకరిని ఒకరు మటాష్ చేసుకుంటారు. ఇక విశాఖలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అక్కడ ఆయన టీడీపీకి నాలుగు సార్లు ప్రెసిడెంట్ గా పనిచేసిన వారు. ఇక్కడ వైసీపీలో మాత్రం సాధారణ నాయకుడు. పైగా ఆయన్ని కలుపుకోవడానికి వైసీపీ నుంచి ప్రయత్నాలు కూడా పెద్దగా జరగడంలేదని అంటున్నారు.ఇక మంత్రి అవంతి శ్రీనివాసరావును స్వయంగా వెళ్ళి వాసుపల్లి గణేష్ కలసివచ్చారు. స్నేహ హస్తం అందించారు. కానీ ఆయన గంటా వర్గీయుడుగా భావించడం వల్లనో ఏమో కానీ మంత్రి సరిగ్గా రియాక్ట్ కాలేదని అంటారు. ఇక ఎంపీ విజయసాయిరెడ్డి అండదండలు ఉన్నా కూడా సొంత నియోజకవర్గంలో ఉన్న నేతలతో సమన్వయం మాత్రం వాసుపల్లికి కుదరడంలేదు. ఇప్పటికే అక్కడ కర్చీఫ్ వేసేసి వైసీపీలోకి ముందే వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ గుర్రు మీద ఉన్నారు. ఇక వైసీపీ పుట్టినప్పటి నుంచి ఉన్న మరో బీసీ నేత కోలా గురువులు సైతం గరం గరం గా ఉన్నారు. ఇటీవలే పరమపదించిన మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ వర్గం కూడా వేరేగా ఉంటోంది. దాంతో వాసుపల్లి గణేష్ కి ఏమీ పాలుపోలేదులా ఉందిట.టీడీపీలో ఉన్నపుడు కూడా వాసుపల్లి పార్టీతో సంబంధం లేకుండా తనదైన స్టైల్లో భారీ ర్యాలీలు, కార్యక్రమాలు తరచూ నిర్వహించేవారు. ఆయనకు ఆ బలం, బలగం ఉంది. ఇపుడు కూడా ఆయన అదే చేశారు. జగన్ గత ఏడాదిన్నరగా ఏపీలో అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రచారం పేరిట పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ విశాఖలో నిర్వహించారు. నిజంగా అది వాసుపల్లి గణేష్ బలప్రదర్శనగానే చూడాలి. కరోనా నిబంధనలు ఉన్నా ఎక్కడ లేని జనం వచ్చి వాసుపల్లికి దన్నుగా నిలబడ్డారు. విశాఖ సౌత్ లో తన పట్టు ఏంటి అన్నది వాసుపల్లి గణేష్ వైసీపీ నేతలకు ఇలా చెప్పారు అని అంటున్నారు. తనకు ఎదురులేదని కూడా ఆయన చెప్పుకున్నారు. అంతే కాదు, తనకు పార్టీలతో సంబంధం లేకుండా బలం ఉందని కూడా చెప్పినట్లైంది.ఇక విశాఖ సౌత్ లో మైనారిటీ నాయకుడు రహమాన్ కి వాసుపల్లికి అసలు పడదు, ఆయన వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నారు. ఆ ఆశతోనే వైసీపీలోకి వచ్చారు. కానీ ఇపుడు వాసుపల్లి గణేష్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో వర్గపోరు ఇక్కడ తారస్థాయికి చేరుకుంది. ఎటూ ద్రోణం రాజు శ్రీనివాస్ లేనందువల్ల ఆయన వర్గాన్ని కూడా కలుపుకుని తన బలాన్ని పెంచుకోవడానికి రహమాన్ చూస్తున్నారు. ఆయన ఇపుడు వాసుపల్లికి ఢీ కొట్టేలా ఉన్నారు. ఈ పరిణామాల వల్ల వైసీపీకి సౌత్ లో కొత్త తలనొప్పులు తప్పేలా లేవు అంటున్నారు. మరి చూడాలి దీన్ని పెద్దలు ఎలా సర్దుతారో.