హైద్రాబాద్, అక్టోబరు 24,
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించే విషయంలో టీఎస్ ఆర్టీసీ పెట్టిన అన్ని నిబంధనలకూ ఏపీఎస్ ఆర్టీసీ అంగీకరించింది. తాము తగ్గించుకున్నంత మేరకు, తెలంగాణ బస్సు సర్వీసులను పెంచుకోవాలని కోరిన ఏపీ, అందుకు తెలంగాణ ఏ మాత్రమూ అంగీకరించకపోయేసరికి ఇప్పుడు మరిన్ని మెట్లు దిగి వచ్చింది. పండగ సీజన్ సమయంలో బస్సులు నడిపించకుంటే, రెండురాష్ట్రాల ఆర్టీసీలూ తీవ్రంగా నష్టపోతాయన్న ఉద్దేశంతో, ఏపీకి నష్టం అధికంగా జరుగుతుందని తెలిసినా కిలోమీటర్లను పూర్తిగా తగ్గించుకునేందుకు అంగీకరించింది. దీంతో లాక్ డౌన్ నుండి ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఏపీ రవాణా శాఖ కాస్త వెనక్కి తగ్గి, తెలంగాణ ప్రతిపాదనలకు ఒకే చెప్పింది. ఈ మేరకు ఏపీ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ఏపీకి నష్టం కలుగుతున్నా 1.6లక్షల కి.మీ తగ్గామని తెలిపారు.తెలంగాణ అభ్యంతరాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని, అయినా సరే తాము తెలంగాణ ప్రతిపాదన మేరకు బస్సులు నడిపేందుకు దిగి వచ్చామన్నారు. తెలంగాణ కోరినట్లు రూట్ వైస్ క్లారిటీ కూడా ఇచ్చామని.. ఫైనల్ ప్రపోజల్స్ కూడా గత వారమే పంపినా స్పష్టత రాలేదన్నారు. టీఎస్ అభ్యంతరాలతో ఏపీకి నష్టం ఎక్కువే అయినప్పటికీ, ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలని నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు. టీఎస్ కోరినట్టుగా రూట్ల వారీగా క్లారిటీ కూడా ఇచ్చామని, తుది ప్రతిపాదనలను గత వారంలోనే పంపామని, టీఎస్ స్పందన కోసం వేచి చూస్తున్నామని అన్నారు.ఏపీ బస్సులు తెలంగాణలో 2.64లక్షల కి.మీ తిరుగుతుండగా… తెలంగాణ బస్సులు మాత్రం ఏపీలో 1.61లక్షల కి.మీ తిరుగుతున్నాయని తెలంగాణ అధికారులు అభ్యంతరం చెప్పారు. ఏపీ సర్వీసులు తగ్గించుకోవాలని తెలంగాణ పట్టుబట్టడంతో రెండు నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరుసగా దసరా, దీపావళి, క్రిస్టమస్, సంక్రాంతి పండుగలు వస్తుండడంతో వీలైనంత త్వరగా బస్సులను తిప్పాలని, లేకుంటే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.