YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోలవరంపై పోరాటమా..? రాజీ పడటమా..?

పోలవరంపై పోరాటమా..? రాజీ పడటమా..?

విజయవాడ, అక్టోబరు 24 
విభజనతో సర్వం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు విభజన చట్టంలో ఇచ్చిన ఒకే ఒక్క రియలిస్టిక్ హామీ పోలవరం. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి.. ప్రతీ పైసా భరిస్తామని చట్టంలో పెట్టారు. కానీ ప్రత్యేకహోదాను ఎలా చేశారో.. ఇప్పుడు పోలవరాన్ని కూడా అలాగే చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 20వేల కోట్లే అంటూ.. కొత్తగా వెనక్కి వెళ్లిపోయి.. అంచనాలు మార్చేసుకుని ఏపీ నోట్లో మట్టి కొడుతున్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరానికి ఉరితాడు వేస్తున్నారు. దేశానికే అన్నం పెట్టే ప్రాజెక్ట్ అవుతుందని… బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అని కబుర్లు చెప్పిన కేంద్రం ఇప్పుడు.. ఆ ప్రాజెక్ట్‌ను మూలన పడేసేలా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఏపీ సర్కార్ ముందు.. పోరాటం మాత్రమే మిగిలి ఉంది. లేదని రాజీ పడితే.. పోలవరం ఇక కలగానే మిగిలిపోతుంది. పోలవరం నిర్వాసితుల సలహా, పునరాాస కార్యక్రమాలకే రూ. 33వేల కోట్లు కావాలి. ఈ ఖర్చులో ఓ రూపాయి పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం లేదు. ఈ విషయాన్ని కేంద్రం కూడా అంగీకరించింది. అందుకే.. టీడీపీ హయాంలో రూ. 55వేల కోట్ల అంచనాలకు టెక్నికల్ ఆమోదం లభించింది. ఇప్పుడు మొత్తం అడ్డం తిరిగేసి.. ప్రాజెక్ట్ మొత్తానికి రూ. 20వేల కోట్లే అంటూ వాదిస్తోంది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కేంద్రం గల్లా పట్టుకుని అన్నింటినీ ప్రశ్నించేది. టీడీపీ ఎంపీలు.. తెల్లవారక ముందే.. కేంద్ర మంత్రుల ఇళ్ల ముందు ఉండేవారు. ఎప్పటికప్పుడు.. ఒత్తిడి తెచ్చే వారు. టీడీపీ ఎంపీల ఒత్తిడి భరించలేక.. ఎప్పటికప్పుడు నిధులు కూడా విడుదలయ్యేవి. కానీ ప్రస్తుతం.. గతంలో ఆమోదించిన అంచనాలను కూడా భారీగా తగ్గించి… ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా సతాయిస్తోంది. రాష్ట్రం అడగడానికి కూడా మొహమాట పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే.. తాము తగ్గించిన అంచనాలను ఆమోదిస్తేనే పెండింగ్‌లో ఉన్న రూ. రెండు వేల రెండు వందలకోట్లను చెల్లిస్తామంటూ మెలిక పెడుతోంది. ఏపీ సర్కార్ హక్కుగా రావాల్సిన పోలవరాన్ని కూడా అంతే స్థాయిలో అడగానికి సంకోచిస్తోంది. ఫలితంగా పోలవరం ఇప్పుడు ప్రమాదంలో పడింది. కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తే సహకరించదని తేలిపోయింది. ఇప్పుడు ఏపీసర్కార్‌కు పోరాటమే మిగిలింది. పోరాడితే పోలవరం అయినా మిగులుతుంది.. రాజీపడితే.. రాష్ట్ర ప్రజల భవిష్యత్ సందిగ్ధంలో పడుతుంది. కరువును తరిమేసే శక్తి ఉన్న పోలవరం.. కలగా మిగిలిపోతుంది. ఎంత ఆలస్యం అయితే పోలవరం ప్రాజెక్ట్ వ్యయం అంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది.

Related Posts