విజయదశమి చాలా శుభప్రదమైన దినం. ఆ రోజున కళాకారులు, విద్యార్థులు తమ కొత్త కార్యక్రమాలు ఆరంభించే రోజుగాను, దేవిని పూజించి ఆరాధిస్తారు. విజయదశమి వైభవంగా జరుపుకొనవలసిన పండుగ. విశిష్టమైన ఆ పండగ మహిమ తెలుసుకుందాము.
కాలరూపిణిగా భావించే అంబికకు సహస్రనామాలలో విజయ అనే పేరు వున్నది. ఆశ్వీయుజ శుక్లపక్ష దశమినాడు అంటే విజయదశమినాటి సాయంకాలం, నక్షత్రాలు కనిపించే సమయానికి విజయ అనే పేరు వున్నది. ఆ శుభముహూర్తంలో , ఆరంభించే కార్యాలు అన్నీ జయప్రదమవుతాయని " ముహూర్త చింతామణి" అనే గ్రంధం తెలియ చేస్తున్నది. దసరా ఉత్సవాలు జరిపేటప్పుడు విజయదశమి నాడు విజయ అనబడే ఆ శుభ ముహూర్త సమయాన్నే బాణము వేయడం జరుగుతుంది.
జీవితంలో విజయాలు సాధించాలనుకున్నవారు, ఆసమయంలోనే తమ జైత్రయాత్ర ప్రారంభించాలని " రత్నకోశం" అనే గ్రంధం తెలియ చేస్తున్నది. ఉత్తర దేశ రాష్ట్రాలలో బయలు మైదానంలో జరిపే "రామలీలా" మహోత్సవంలో రామ కధా నాటకానికి ముఖ్యమైన రోజు విజయదశమి. ఆ రోజున రాముని పాత్ర ద్వారా బాణాలు వేసి రావణుని, కుంభకర్ణుని, ఇంద్రజిత్ ని సంహరిస్తారు. ఈ ముగ్గురి రూపాలను తయారు చేసి దహనం చేస్తారు. ఈ చర్య దుర్మార్గాన్ని నాశనం చేసి సన్మార్గాన్ని, ధర్మాన్ని నిలబెట్టడం కోసమని తెలియ చేస్తున్నది.
శ్రీ రాముడు తొమ్మిది రోజులు శక్తిదేవతని ఆరాధించి పదవ రోజైన విజయదశమినాడు విజయం పొందాడు. ఈ కారణంగానే తరువాత వచ్చిన రాజులు పదవరోజున ఆయుధ పూజలు చేయడం శతృవుల మీద దండయాత్ర చేయడం ఆరంభించారు. ఈ ఆచారాలు యీ విధంగా ప్రారంభమై "దసరా ఉత్సవాలకి" నాంది పలికింది. చాముండి మాత తొమ్మిది రోజులు మహిషాసురునితో యుధ్ధం చేసి, పదవరోజైన విజయదశమినాడు మహిషాసురిని సంహరించినదని దేవీమహాత్యం తెలుపుతున్నది. భండాసురుని తో లలితాపరమేశ్వరి తొమ్మిది రోజులు యుధ్ధం చేసి , పదవ రోజు ఆ దానవుని సంహరించి విజయం పొందినదని లలితోపాఖ్యానము తెలియ చేస్తున్నది. దేవి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టినదనడానికి నిదర్శనాలు.
విజయదశమి నాడు మరాఠీవారైన ఛత్రపతి శివాజీ , హిందూ ధర్మాన్ని కాపాడడానికి , భవానీ దేవి ముందు శపధం చేసి బయలుదేరినట్టు చరిత్ర తెలుపుతున్నది.
విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించడం విశిష్టం. మహావిష్ణువు ఆలయాలలో , స్వామి అశ్వవాహనం మీద జమ్మి చెట్టుకి ప్రదక్షిణలు చేయడం యీనాటికి ఆచారంగా వున్నది.
నవరాత్రులలో ఆఖరి రోజున ముగ్గురు దేవేరులు ఏకమై శివశక్తి రూపమై అనుగ్రహం కటాక్షిస్తున్నది. ఈరోజునే విజయదశమి అని మహాశక్తిగా పూజిస్తున్నారు. శివ శక్తులు ఏకమైనందున సర్వ శుభాలు ,లభిస్తాయి.విజయ దశమి నాడు అక్షరాభ్యాసము , అని బాలలకు విద్య ఆరంభిస్తారు. ఆనాడు ఆరంభిస్తే పిల్లలు ఉన్నత విద్యావంతులౌతారని చెప్తారు.
విజయదశమి విజయాలనొసగే రోజు.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో