విజయవాడ, అక్టోబరు 26,
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ యాక్టివ్ అయిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. స్థానిక ఎన్నికలను వాయిదా వేసి జగన్ తో కయ్యానికి కాలు దువ్విన నిమ్మగడ్డ ఇప్పుడు అవే ఎన్నికలు నిర్వహించి మరోసారి సర్కార్ కి సవాల్ విసరడానికి సిద్ధం అయిపోయారు. కోర్టు ఆశీస్సులు తనకు ఎలాగూ లభించడంతో రిటైర్ అయ్యేలోగా వైసిపి సర్కార్ తో ఫైనల్ మ్యాచ్ ఆడి గెలవాలని తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుగ్లీ విసిరారు. ఎన్నికల నిర్వహణకు సర్వం అనుకూలమని ఆయన భావిస్తూ అఖిలపక్షాన్ని పిలవడమే సర్కార్ తో అమీతుమికి సిద్ధం అని చెప్పడమే అంటున్నారు విశ్లేషకుఆయన ఇలా అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించారో లేదో కానీ వెంటనే అధికార పార్టీ తమ అస్త్రాలను ఎక్కు పెట్టింది. అదీ కూడా అంతకు ముందు ఏ కరోనా ను సాకుగా చూపి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేసారో అదే రీజన్ మరోసారి తెరపైకి తెచ్చేసింది. పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రభుత్వ ఆలోచన ఎన్నికలకు సిద్ధంగా లేనట్లు గా ప్రకటించేశారు. నవంబర్, డిసెంబర్ లలో కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని అంటున్నందున ఇది అత్యంత ప్రమాదమని ఆ రెండు నెలలు పరిశీలించి ఎన్నికలకు వెళ్లాలా లేదా నిర్ణయిస్తామని చెప్పేశారు. బీహార్ ఎన్నికల వంటివి తప్పవు కనుక జరుగుతున్నాయని స్థానిక ఎన్నికలకు తొందర ఏముందని ఆయన పెదవి విరిచారు.జగన్ సర్కార్ నిర్ణయాలను నిత్యం వ్యతిరేకించే విపక్షాలు ఇప్పుడే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు. గతంలో సగం జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగినందున , సక్రమం గా ఏకగ్రీవం ఆయిన ఎన్నికలు జరగనందున వాటిని రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరపాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఈసీ అన్ని పార్టీల సమావేశాన్ని ఈనెల 28 న ఏర్పాటు చేశారు. కానీ సర్కార్ సై అనకపోతే ఈ అంశంఎపి లో మరో రాజకీయ దుమారానికి కారణం అవుతుందని అంతా భావిస్తున్నారు. దీనితో బాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ టిడిపి ఆడినట్లే ఆడుతున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమిటని వైసిపి ఎదురుదాడి చేసే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మొత్తానికి మరోసారి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెర్సెస్ జగన్ సర్కార్ ఐపీఎల్ మ్యాచ్ లు చూసేందుకు జనం మాత్రం రెడీ అయిపోయారు.