నెల్లూరు అక్టోబరు 26,
రాజకీయాల్లో మార్పు మంచిదే. ఎప్పుడూ గొడవలు పడుతూ.. ఒకరిపై ఒకరు కొట్టుకుంటూ.. ఉంటే ఏముంటుంది ? అందుకే వైసీపీ నేతలంతా కూడా మారారట.. ప్రస్తుత రాజకీయాల్లో భిన్నమైన వాతావరణం కనిపించే నెల్లూరు జిల్లాలో వైసీపీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. రెడ్డి సామాజిక వర్గం నేతలు భారీ ఎత్తున గెలుపుగుర్రాలు ఎక్కారు. పార్టీలు మారిన వారు.. జంప్ జిలానీలు ఇలా.. అనేక మంది విజయం సాధించారు. ఈ క్రమంలోనే మంత్రి పీఠాలను ఒక రెడ్డికి, ఒక బీసీకి కేటాయించారు జగన్. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతం రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌లను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.అయితే.. మేకపాటి గౌతం రెడ్డి ఎప్పుడూ.. కూడా నిదానస్తుడుగా పేరు సంపాయించుకున్నారు. వివాదాలకు అతీతంగాను ఉంటారు. పెద్దగా విమర్శలు కూడా ఆయన ఎప్పుడూ చేసింది లేదు. ఆయన నోటి నుంచి పెద్దగా విమర్శలు కూడా వచ్చింది లేదు. దీంతో దూకుడంతా కూడా మంత్రి అనిల్‌దే అన్నట్టుగా సాగింది. ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వాలన్నా.. జగన్ తరఫున మాట్లాడాలన్నా.. రాజకీయంగా దూకుడు చూపించాలన్నా.. ఆయన కు ఆయనే సాటి అనేలా వ్యవహరించారు. దీంతో పాలన పరంగా కూడా అధికారులు, ఇతర నేతలు అందరూ ఆయన చుట్టూ తిరిగేవారు. జిల్లాలో రాజకీయాలు, అధికారాలు కూడా మంత్రి అనిల్ తన కన్నుసన్నలతో శాసించారనే పేరుంది.దీంతో కొందరు రెడ్డి సామాజిక వర్గం నేతలు ఫీలయ్యారు. తాము ఏపనికావాలన్నా.. కావడం లేదని, తమకు విలువ లేదని వాపోయారు. ఆనం రామనారాయణరెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి వంటివారు బాహాటంగానే విమర్శలు సంధించారు. దీంతో జిల్లాలో ఎంతో బలం ఉన్నప్పటికీ.. వైసీపీలో కొరవడిన ఐకమత్యం కారణంగా.. పార్టీ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. ఈనేపథ్యంలో సీఎం జగన్‌కు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి మేకపాటికి జిల్లా రాజకీయాలు అప్పగించారని, అందరినీ కలుపుకొని పోయే బాధ్యతలను అప్పగించారనే ప్రచారం సాగుతోంది. ఇక, ఇది నిజమేనా? అన్నట్టుగా.. చాలా మంది నేతలు ఇప్పుడు మేకపాటి ఇంటికి క్యూకడుతున్నారు.నిన్న మొన్నటి వరకు కూడా మంత్రి మేకపాటి ఇంటికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తప్ప ఎవరూ వచ్చేవారు కాదు. ఇప్పుడు సడన్‌గా.. నేతలంతా ఒక్కటవ్వడం మొదలు పెట్టారు. వారం క్రితం జిల్లాలో మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రెండు రోజుల వ్యవధిలోనే జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, మరో రెండు రోజుల వ్యవధిలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యలు వరుసగా మంత్రి మేకపాటిని కలుసుకున్నారు.దీంతో జగన్ ఆదేశాలు ఫలించాయని, జిల్లాలో రాజకీయం భలేగా మారిందని వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం. మరి ఈ ఐక్యత ఇలానేకొనసాగుతుందా ? లేదా.. అనే విషయంపై టీడీపీ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుండడం గమనార్హం. అదే సమయంలో నిన్నటి వరకు జిల్లా రాజకీయాన్ని పూర్తిగా తానే కంట్రోల్ చేసేలా చక్రం తిప్పిన అనిల్‌కు కొన్ని కత్తెర్లు కూడా పడ్డాయంటున్నారు. అందుకే రెడ్డి నేతలంతా మేకపాటి ఇంటికి ఉత్సాహంగా గెంతుతున్నారట.