గుంటూరు, అక్టోబరు 26,
నరేంద్ర మోడీ దారిలో సీఎం జగన్ పయనిస్తున్నారా ? మోడీ మాదిరిగానే సంస్కరణల పేరుతో జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారా ? అంటే..ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నవారు ఔననే అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించాక.. ప్రజోపయోగ కార్యక్రమాలను అనేకం అటకెక్కించారు. అవేస్థానంలో మరికొన్ని తెచ్చినా..ప్రభుత్వ ప్రమేయం..ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా చూసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అనేక మంది పలు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరమయ్యారు. అదేంటని ప్రశ్నిస్తే.. మీరు వేరే రూపంలో కొన్ని పథకాలను వినియోగించుకోవచ్చు..! అని కేంద్రం పెద్దలు చెప్పారు.మహిళలకు బ్యాంకులు వడ్డీ రహిత రుణాలను మోడీ రద్దు చేశారు. అదే సమయంలో ముద్ర లోన్లను తెచ్చారు. వీటికి వార్షిక ప్రాతిపదికన 7.5 శాతం వడ్డీ పడుతుంది. ఇది భారం. ఇక, పెట్రోలు ధరలపై గతంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించే విధానాన్ని రోజువారీగా మార్చారు. అంటే.. ప్రతి రోజూ పెట్రోల్ ధరల సమీక్ష పేరుతో ప్రజల నుంచి వసూళ్లు పెంచుకునే వెసులు బాటు కల్పించారు. ఇది కూడా మీ మేలు కోసమే అన్నారు. ఇతర గిరిజన పథకాలను కూడా అటకెక్కించారు. వీటిని కూడా వారి మేళ్లకోసమేనని.. భారత దేశ పురోభివృద్ది కోసమేనని చెప్పారు.ఇక, ఇప్పుడు సీఎం జగన్ కూడా ఇలానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సర్కారు ఆర్థికంగా కుంగిపోతున్న నేపథ్యంలో అనేక పథకాలకు మంగళం పాడుతున్నారు. వృత్తులు, కులాల ప్రాతిపదికగా ఇచ్చే రుణాలను అటకెక్కించారు. వీటి స్థానంలో అందరికీ కలిపి అమ్మ ఒడి, వాహన మిత్ర, రైతు భరోసా వంటివి ఉన్నాయి కదా! అంటున్నారు. ఇక, గిరిజనుల విషయానికి వస్తే.. జగన్ తండ్రి వైఎస్ కష్టించి, కేంద్రాన్ని ఒప్పించి ప్రవేశ పెట్టిన ట్రైకార్ రుణాల సబ్సిడీని తాజాగా ఎత్తేశారు. అంటే.. గిరిజనులు తమ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంటే.. ప్రభుత్వం ఇచ్చే నూటికి రూ. 35 సబ్సిడీ ఇకమీదట ఉండదు.అంతేకాదు, వారు ఇప్పటి వరకు నూటికి 5 రూపాయలు పెట్టుబడి పెట్టుకుని స్వయం ఉపాధికి ఏ వాహనమో కొనుక్కుంటే.. ఇప్పుడు దానిని డబుల్ చేశారు. ఇవన్నీ కూడా ఆయా వర్గాల్లో ఆగ్రవేశాలు తెప్పిస్తున్నాయి. కానీ, ఇదంతా మీకోసమేనని జగన్ చెబుతున్నారు. అయితే, మోడీ మాదిరిగా మాటల మాంత్రికుడు కాకపోవడం జగన్ కు పెద్ద మైనస్. దీంతో మోడీ బాటలో వెళ్తున్న ఆయనకు ఆయా వర్గాలు దూరం కావడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి