విశాఖపట్టణం, అక్టోబరు 27,
ఏపీ సీఎం జగన్ వ్యవహార శైలితో సొంత పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. “మా నాయకుడు ఎందుకు ఇలా చేస్తున్నారో .. అర్ధం కావడం లేదు. క్షేత్రస్థాయిలో మేం సమాధానం చెప్పుకోలేక ఛస్తున్నాం..!“ అని వైసీపీ మంత్రులు, నాయకులు కూడా ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యలు సంధిస్తున్నారు. ముఖ్యంగా దేవాలయాలపై దాడులు, కనకదుర్గ ఆలయంలో అపహరణలు, అంతర్వేది రథం దగ్ధం వంటి ఘటనల సమయంలో జగన్ వ్యవహారం వివాదానికి దారితీసింది. అదే సమయంలో తిరుమలలో డిక్లరేషన్ వివాదాన్ని తెరమీదికి తెచ్చారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ విషయంలో కీలకమైన సీఎం జగన్ మౌనం పాటించారు. కానీ, అవే విషయాలపై నాయకులు ప్రజాక్షేత్రంలో నలిగిపోయారు. ఎక్కడికి వెళ్లినా.. మీడియా వారిపై ప్రశ్నలు సంధించింది. అదే సమయంలో నియోజకవర్గంలోనూ నిలదీతలు పెరిగాయి. దీంతో జగన్ వ్యవహారంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఇక, ఇప్పుడు తిరుమల శ్రీవారి విషయంలో స్వామికి భక్తులు కానుకగా ఇచ్చిన వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం రుణంగా తీసుకునేందుకు లేదా బ్యాంకుల ద్వారా శ్రీవారి నిధులను చూపించి.. పరోక్షంగా రుణాలు పొందేందుకు జగన్ సర్కారు పావులు కదుపుతున్న వ్యవహారం మరింత దుమారం రేగుతోంది. దీంతో ఈ విషయాలు కూడా రాజకీయంగా ఇబ్బందిగా మారాయి.ఆయా విషయాలపై నేతలకు ఎక్కడికక్కడ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో వారు ఎలాంటి సమాధానం చెప్పాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే, ఈ పరిస్థితి ఒక్క నేతలకేనా? అంటే.. కాదని అంటున్నారు పరిశీలకులు. సీఎం జగన్‌ను వెనుకేసుకు వచ్చిన, ఆయనకు గురువుగా మారి సలహాలు, సూచలను చేసిన, జగన్‌సీఎం అయ్యేందుకు యాగాలు చేసిన విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర వంటి సన్యాసులకు కూడా ఈ పరిణామాలు, జగన్ వ్యవహార శైలి తీవ్ర ఇబ్బందిగా మారాయనే టాక్ వినిపిస్తోంది. “స్వామీ మీ శిష్యుడు తిరుమల సొమ్మును ఖజానాకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా.. మీరు మౌనంగా ఎందుకు ఉంటున్నారు“ అంటూ ఓ భక్తుడు ఇటీవల లేఖ సంధించాడు.అదే సమయంలో హిందూ వర్గాల నుంచి స్వామి మౌనంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. మీడియా అయితే.. చెప్పేదేముంది..ప్రత్యేక కథనాలనే ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ వ్యవహారంపై ఎటు మాట్లాడినా..తనకు తలనొప్పేనని స్వామి భావిస్తున్నారట. “మన దగ్గర దణ్నాలు పెడతాడు. దీంతో మనమే.. ఆయనను నడిపిస్తున్నట్టు అందరూ అనుకుంటారు. మనకెందుకు ఈ తలనొప్పి!“ అని స్వామికి అత్యంత సన్నిహితంగా ఉండే.. మరో స్వామి వ్యాఖ్యానించినట్టు పీఠం వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి జగన్ దూకుడు నేతలనే కాకుండా సన్యాసులనుకూడా డిఫెన్స్‌లో పడేస్తోందని అంటున్నారు పరిశీలకులు