గుంటూరు, అక్టోబరు 27,
బీసీల్లో పెద్ద బీసీ అచ్చెన్నాయుడు భుజ స్కందాల మీద చంద్రబాబు పెద్ద బాధ్యతనే పెట్టేశారు. అందరూ ఊహిస్తున్నట్లుగానే ఆయన్ని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ని చేసేశారు. అచ్చెన్నాయుడు ది ఇపుడు రాజ మార్గం కాదు, ముళ్ళ బాటేనని చెప్పుకోవాలి. ఓవైపు సొంత జిల్లాలో పార్టీ కుదేల్ అయింది. తన సొంత నియోజకవర్గం టెక్కలిలోనే పార్టీ పడకేసింది. ఇక ఉత్తరాంధ్రాలో కూడా టీడీపీకి గత వైభవం ఒక కలగా మారింది. సీనియర్లు జావగారారు, జూనియర్లకు పట్టుచిక్కడంలేదు. ఈ మొత్తం వ్యవహారాలు ఇలా ఉంటే ఏపీలో కూడా టీడీపీ గతి తప్పేసింది. బీసీల పార్టీ కాస్తానానాటికీ దిగనారుతోంది. దాంతో అచ్చెన్నాయుడు ఇపుడు వెంటనే కార్యరంగంలోకి దిగాల్సిన అవసరం అయితే ఉంది.ఇప్పటిదాకా చంద్రబాబు ఒక్కరే టీడీపీ తరఫున గట్టిగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఆయనకు పక్క వాయిద్యంగా అచ్చెన్నాయుడు సహకారం ఉండేది. బయట పార్టీలో మాత్రం సీన్ రివర్స్. అంతా చప్పబడ్డారు. అటువంటి వేళ అచ్చెన్నాయుడిని జగన్ సర్కార్ అరెస్ట్ చేసింది. దాంతో ఆయన ఏపీలో కొంత కీలకం అయ్యారు. ఆ ఊపు అలా ఉండగానే ఆయన్ని వాడేసుకోవాలని చంద్రబాబు ఏపీ ప్రెసిడెంట్ అని కిరీటం తగిలించారు. ఈ కిరీటం తో అచ్చెన్నను జనంలోకి వెళ్ళమంటునారు. అధారాలు తరువాత ఉన్నవీ లేనివీ వైసీపీ సర్కార్ మీద బురద జల్లుతూ ప్రతీ రోజూ మాట్లాడాల్సిందే. దాని మీద ప్రతీ రోజూ అచ్చేసే అనుకూల మీడియా పత్రికలు ఎటూ ఉన్నాయి. దాంతో ఏదో విధంగా నెగిటివ్ ప్రచారం జనంలోకి పోవాలి. ఇదే బాబు గారి ఎత్తుగడ.ఇవన్నీ బాబు గారి ఆలోచనలు, ఆశలు అని అనుకున్నా కూడా అచ్చెన్నాయుడు అంతలా గర్జిస్తారా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. గట్టిగా మాట్లాడినా కూడా ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళు సమయం ఉంది. అప్పటికి రాజు ఎవరో మంత్రి ఎవరో, అచ్చెన్నకు మంత్రి పదవి తప్ప వేరే విధంగా దక్కే చాన్సేలేదు. ఆ మంత్రి పదవిని ఆయన గత అయిదేళ్ళలో ఎటూ ఎంజాయ్ చేశారు కూడా. కనీసం ఉప ముఖ్యమంత్రి పదవిని మంచి శాఖలతో నంబర్ టూ ప్లేస్ గా తన ప్రభుత్వంలో ఇస్తాను అని చంద్రబాబు బలమైన హామీ ఏదైనా ఇస్తే అచ్చెన్నాయుడు ముందుకు ఉరుకుతారేమో. లేకపోతే అతి బలంగా ఉన్న వైసీపీ మీద నోరు చేసుకోవడానికి ఆయన తెగిస్తారా అన్నది కూడా ఒక ప్రశ్నగా ఉంది.ముఖాలు మారాయి తప్ప టీడీపీకి కొత్తగా వచ్చిన బలమేముంది. ఉన్న బీసీలను నేర్పుగా జగన్ తన వైపునకు తిప్పుకుంటున్నారు. అధికారంలో ఉన్నపుడు బీసీలను టీడీపీ వాడుకుంది అన్న ఆగ్రహం బీసీల్లో ఉంది. ఇపుడు జగన్ అలా కాకుండా వెతికి పెట్టి మరీ బీసీల్లో పెద్ద ఎత్తున ఉన్న ఉప కులాలకు కూడా కార్పోరేషన్ల పేరిట అధికార పదవులు పంచిపెడుతున్నాడు. మరి వారంతా ఇపుడు టీడీపీ వైపు ఎందుకు తొంగి చూస్తారు. ఇక బీసీల విషయంలో టీడీపీ కొత్తగా హామీలు ఇచ్చినా నమ్మే సీన్ ఉందా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా బీసీలకు పెద్ద పీట అంటూ పార్టీ ప్రెసిడెంట్ పదవిని అచ్చెన్నాయుడుకు ఇచ్చినా కూడా అసలు అధికారం పెదబాబు, చినబాబుల వద్దనే ఉంటుంది అన్నది తెలిసిందే. ఈ మాత్రం భాగ్యానికి టీడీపీకి కొత్త శక్తి వచ్చిందని అనుకునేంటంత అమాయకం తమ్ముళ్ళు ఉన్నారా అన్నది కూడా చూడాలి.