న్యూఢిల్లీ, అక్టోబరు 27,
తక్కువ ధరకే ఇంటర్నెట్ ఇస్తున్న దేశాల లిస్టులో భారత్ కూడా ఉంది. అయితే ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం చాలా తక్కువగానే ఉంటుంది. ఆ నెట్ వర్క్ స్పీడ్ రావడం లేదు.. ఈ నెట్ వర్క్ స్పీడ్ రావడం లేదంటూ ఫిర్యాదులు చేస్తుండే వాళ్లను ఎంతో మందిని చూసే ఉంటాం. ఆ ఫిర్యాదులు నిజమేనని అనిపిస్తూ ఉంటుంది. భారత్ లో ఇంటర్నెట్ స్పీడ్ అతి తక్కువ అని మరో సారి రుజువైంది. ఎంత తక్కువగా అంటే ఇరాక్ దేశం కంటే అతి తక్కువ స్పీడ్ వస్తూ ఉందట. భారత్ కు ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్థాన్, నేపాల్ లలో ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉందని.. ఊక్లా సంస్థ స్పష్టం చేసింది. ఊక్లా తాజా గణాంకాల ప్రకారం ఇంటర్‌నెట్ స్పీడ్‌లో పాకిస్తాన్, నేపాల్‌లు మనకంటే మెరుగైన స్ధితిలో ఉన్నాయి. ఊక్లా సెప్టెంబర్ స్పీడ్ ఇండెక్స్‌లో 121 ఎంబీపీఎస్‌తో మొబైల్ ఇంటర్‌నెట్ స్పీడ్‌లో దక్షిణ కొరియా అగ్రస్ధానంలో నిలిచింది. 12.07 ఎంబీపీఎస్ సగటు వేగంతో భారత్ ఈ జాబితాలో 131వ స్ధానానికి దిగజారింది. పాకిస్తాన్ 17.13 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఈ జాబితాలో 116వ స్ధానంలో ఉంది. నేపాల్ 17.12 ఎంబీపీఎస్ వేగంతో 117వ స్ధానంలో ఉంది. 19.95 ఎంబీపీఎస్ స్పీడ్‌తో శ్రీలంక మెరుగైన స్ధానంలో నిలిచింది. ఇరాక్ 12.24 ఎంబీపీఎస్ స్పీడ్‌తో భారత్ కంటే మెరుగైన స్ధానంలో ఉంది. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ లో 226 ఎంబీపీఎస్ సగటు వేగంతో సింగపూర్ నెంబర్ వన్ ర్యాంక్‌లో నిలిచింది. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో మాత్రం నేపాల్ (113), పాకిస్తాన్ (159)ల కంటే భారత్ (70) ఊక్లా ర్యాంకింగ్‌లో మెరుగైన స్ధానంలో ఉంది.