విశాఖ పట్నం అక్టోబరు 27,
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవరత్న పథకాల అమలులో భాగంగా విశాఖ నగరంలో గుర్తించిన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు స్వాధీనపర్చాలని సీపీఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు డిమాండ్ చేశారు. విశాఖపట్నం పెందుర్తి శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ఎస్ ఆర్ పురం,జుత్తాడ తదితర ప్రాంతాల్లో పేద ప్రజల ఇళ్లు కోసం వేసిన లేఔట్లను సీపీఐ ప్రతినిధి బృందం మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంపిక చేసిన వారందరికీ దీపావళి లోగా ఇళ్ళ స్థలాలను పట్టణ ప్రాంతాల్లో 02సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 03 సెంట్లు ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేస్తున్నదని ప్రభుత్వం సేకరించిన భూమిలో కేవలం 4 వేల ఎకరాల పైన మాత్రమే న్యాయస్థానంలో వివాదాలు కొనసాగుతున్నాయని మిగిలిన భూమిని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసేందుకు ఎటువంటి ఆటంకములు లేవని ఎంపిక చేసిన పేద ప్రజలందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసరావు, పి చంద్రశేఖర్ నాయకులు వై త్రినాద్ ,కె నారాయణ రావు, ఎన్ అసిరినాయుడు, కె తిరుపతి రావు, రమణ, మల్లేష్, శ్రీను,తదితరులు పాల్గొన్నారు.