అనంతపురం, అక్టోబరు 28,
టీడీపీలో కీలక నేతలకు చంద్రబాబు పట్టం కట్టారు. పార్లమెంటరీ పదవులు అన్నారు ఇచ్చారు. పార్లమెంటరీ మహిళా కమిటీలన్నారు పంచుకున్నారు. ఇక, ఇప్పుడు పార్టీలో అత్యంత కీలకమైన రాష్ట్ర కమిటీని, పొలిట్ బ్యూరో, జాతీయ పదవులను కేటాయించారు. మంచిదే. పార్టీలో పదవులు కావాల్సిందే. నాయకులు పరుగులు పెట్టాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలో బలమైన వాయిస్ ఉండి, దూకుడుగా ఉండే నాయకులకు పదవుల అవసరం చాలానే ఉంది. అయితే అలాంటి నేతలను మాత్రం చంద్రబాబు పక్కన పెట్టడమే ఇప్పుడు చర్చకు దారితీస్తున్న వ్యవహారం. వీరిలో చాలా మంది కీలక నాయకులు ఉన్నారు. మరీ ముఖ్యంగా తన సొంత సామాజిక వర్గానికి చెందిన పయ్యావుల కేశవ్.. ను కూడా చంద్రబాబు పక్కన పెట్టారు.ఇక, మాజీ మంత్రి నారాయణకు కూడా స్థానం లభించలేదు. సరే.. ఎలాగా పార్టీ మారే ఉద్దేశం ఉందని ప్రచారం జరుగుతున్న గంటా శ్రీనివాసరావు బంధువే కాబట్టి.. ఆయనను పక్కన పెట్టారని అంటున్నారు. మరి పయ్యావుల కేశవ్ ఏం పాపం చేసుకున్నారు. ఆయనకు ఎందుకు ఏ కమిటీలోనూ అవకాశం ఇవ్వలేదు. అనంతపురంలో ఆది నుంచి పార్టీకి అండగా ఉన్న పయ్యావులను కాదని ఆయన జూనియర్లకు అవకాశం ఇవ్వడం ఏంటి ? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఇటీవల కాలంలో పయ్యావుల కేశవ్ పార్టీకి డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు.చంద్రబాబు పిలుపునిచ్చిన ఏకార్యక్రమానికీ ఆయన హాజరుకావడం లేదు. పైగా ఆయన ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా ఉండి కూడా ఇసుక అక్రమాలు, గనుల అక్రమాలు, నాడు-నేడులో జరుగుతున్న దుర్వినియోగం.. వివిధ పథకాల్లో జరుగుతున్న అవినీతిపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించకపోవడం.. ప్రభుత్వంపై నివేదిక ఇవ్వకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయి 23 సీట్లతో సరిపెట్టుకున్నా కూడా ప్రతిష్టాత్మకమైన పీఏసీఎస్ పదవిని ఎన్ని విమర్శలు వచ్చినా బాబు పయ్యావుల కేశవ్ కే కట్టబెట్టారు.అయితే పయ్యావుల కేశవ్ తన పదవికి న్యాయం చేయడంలో ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పయ్యావుల కేశవ్ కూడా అంటీముట్టనట్టే ఉంటోన్నది ఓపెన్‌గానే తెలుస్తోంది. ఇక, పార్టీ తరఫున కార్యక్రమాలకు హాజరు కాకపోవడం చంద్రబాబు ఆగ్రహానికి కారణమని అంటున్నారు. అయితే, పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ.. కొందరికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఎటొచ్చీ.. పయ్యావుల కేశవ్ కు మాత్రం ఇవ్వలేదు. మరి మున్ముందు ఆయన వెళ్లిపోయినా ఫర్వాలేదని అనుకున్నారో.. ఏమో చూడాలి. మొత్తానికి బాబు పయ్యావులను పక్కన పెట్టిన అంశం పార్టీలో బాగా చర్చనీయాంశమవుతోంది.