ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపీ హరిబాబు రాజీనామా చేశారు తన స్థానంలో యువకుడ్ని పెట్టాలని ఆయన అధిష్టానానికి రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. అయితే అధ్యక్షుడి ఎంపికపై అధినాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కన్నా లక్ష్మీ నారాయణ, మాజీ మంత్రి మాణిక్యాల రావు, పురందేశ్వరి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఏడాది ఉన్నాయి కనుక సామాజిక సమీకరణాలే కీలకమని బీజేపీ నేతలు చెబుతున్నారు.పార్టీ విధేయుల కోటాలో సోము వీర్రాజు, మాణిక్యాల రావు.. ఎన్నికల కోణంలో కన్నా లక్ష్మీ నారాయణ, పురందేశ్వరి పేర్లు ఉన్నాయి. అయితే టీడీపీలోని అసంతృప్తులను చేరదీయాలన్నా.. ఎన్టీఆర్ సానుభూతి ఓట్లను చీల్చాలన్నా పురందేశ్వరి పేరు పరిగణనలోకి తీసుకోవచ్చని కమలనాధులు చెబుతున్నారు. కాపు వర్గం, కోస్తాలో ప్రభావ వంతమైన నేతగా కన్నాకు అవకాశం లేకపోలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే బీసీలకు ప్రాధాన్యమివ్వాలంటే ఎమ్మెల్సీ మాధవ్‌కు ఛాన్స్ వచ్చే అవకాశముంది. మొత్తానికి చూస్తే.. ఈ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ రెండు, మూడ్రోజుల్లో ముగుస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ జాబితాలో ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మరొకరు మాజీ మంత్రి మాణిక్యాల రావు. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరికి ఏపీ విభాగం అధ్యక్ష పీఠం దక్కుతుందనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.ఇటీవల ఢిల్లీలో జరిగిన మంత్రాంగంలో పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలను తీసుకోవాలని మాణిక్యాల రావుకు సూచించారట జాతీయ నేతలు. అయితే దానికి ఆయన నిరాకరించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో.. ఇక మిగిలింది సోము వీర్రాజు మాత్రమే. ప్రస్తుత సమీకరణాల నేపథ్యంలో సోముకే ఏపీ విభాగం అధ్యక్ష పదవి దక్కుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.