విజయవాడ, అక్టోబరు 28,
జగన్ అతి పెద్ద బాధ్యతలను మోస్తున్నారు. ఓ వైపు ఏపీకి ఆయన ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని నడపడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు, పైగా అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రం ఇది. ఖజానా ఖాళీగా ఉంది. మరో వైపు పెను విపత్తులు, కరోనా వంటి మహమ్మారులు కూడా జగన్ ఏలుబడిలోనే వచ్చి మీద పడుతున్నాయి. ఇక జగన్ కి రాజకీయంగా తలనొప్పులు అన్నీ ఇన్నీ కావు. ఓడినా కూడా టీడీపీ జగన్ కాళ్ళకు బ్రేకులు వేస్తోంది. ఎక్కడ పడితే అక్కడ అడ్డుకట్ట వేస్తోంది. దాంతో అది పెద్ద తలనొప్పిగా ఉంది. దాంతో పార్టీ విషయాలను జగన్ అసలు పట్టించుకొవడంలేదన్న మాట చాలా కాలంగా ఉంది. జగన్ని నేరుగా ఇపుడు ప్రజా ప్రతినిధులే కలవలేకపోతున్నారు అంటున్నారు. గతంలో రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు జగన్ దర్శన భాగ్యం దొరికితే అదే పదివేలు అనేవారు. నాడు ఆయన మాటలను విమర్శలుగా తీసుకున్న వారు కూడా ఉన్నారు కానీ ఇపుడు వారే రాజు గారి మాట కరెక్ట్ అంటున్నారు. జగన్ ఏ ఒక్క ఎమ్మెల్యేని, ఎంపీని నేరుగా కలిసే అవకాశం అసలు ఇవ్వడంలేదన్నది ఇపుడు పార్టీ మొత్తంలో ఉన్న అతి పెద్ద ఆరోపణ. జగన్ కలవాలని సీఎంఓ ఆఫీస్ ని కాంట్రాక్ట్ చేస్తే సజ్జల రామక్రిష్ణా రెడ్డిని కలవమని చెబుతున్నారుట. అంటే జగన్ కేరాఫ్ ఆయనేనని అంటున్నారు.ఒకపుడు జగన్ కుడి భుజంగా విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆయన్ని ఉత్తరాంధ్రా రాజకీయాలు మాత్రమే చూసుకోమని జగన్ చెప్పి పంపించారు. ఇపుడు పార్టీ కేంద్ర కార్యాలయం వ్యవహారాలు మొత్తం సజ్జల రామక్రిష్ణారెడ్డి మాత్రమే చక్కబెడుతున్నారని టాక్. ఎంపీలు, ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా కూడా సజ్జల మీదనే ఆధారపడాల్సివస్తోందని కూడా అంటున్నారు. సజ్జల వద్దనే అన్ని పంచాయతీలు సాగుతున్నాయట. అది ప్రభుత్వ వ్యవహారమా, లేక పార్టీదా అన్నది సంబంధం లేకుండా అన్నీ తానే అవుతున్నారని అంటున్నారు. దీని వల్ల పార్టీకి మేలు జరుగుతోందా అంటే పెదవి విరిచేవారే ఎక్కువాగా ఉన్నారని టాక్.ఇక జగన్ దర్శనం లేకపోతే వెనక్కి తిరిగివస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. సజ్జలను కలవమంటే వద్దులే అనుకుని సర్దుకుపోతున్న వారు కూడా వున్నారట. ఆయన ఏం పరిష్కరిస్తారు అన్న ఆలోచన ఒకటైతే అధినేత తీర్చాల్సిన సమస్యలు పార్టీ నాయకుల వద్ద తేలవు అన్న నిర్వేదం కూడా ఒకటిగా ఉండడంతో నేతలంతా దూరంగానే ఉంటున్నారుట. ఇక పార్టీలో కొత్తగా చాలా మంది వచ్చి చేరుతున్నారు. పాతవారికీ కొత్తవారికీ మధ్యన పెద్ద యుద్ధమే జరుగుతోంది. సర్దిచెప్పాల్సిన బాధ్యులు ఎవరూ పార్టీలో లేరు. జగన్ పట్టించుకోవడంలేదు, ఒక విధంగా చెప్పాలంటే బరువు బాధ్యతలను ఆయన దించుకుంటున్నారా అన్న సందేహాలను పార్టీ వారే వ్యక్తం చేస్తున్నారు అంటే వైసీపీ దారి ఎటు వైపు సాగుతుందో మరి.