తొమ్మిది హత్యల నిందితుడికి ఉరి
వరంగల్ అక్టోబరు 28
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది హత్యల కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ కి కోర్టు ఉరిశిక్ష విధించింది. గత మే 21న వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట సాయి దత్త గన్ని బ్యాగ్స్ కంపెనీలో 9మందికి నిందితుడు మత్తు ఇచ్చి సృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో పడేసి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడు బీహార్కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్కు ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జయ్కుమార్ తీర్పు ప్రకటించారు. నిందితుడి పై 7 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 57మంది మంది వాంగ్మూలం నమోదు చేశారు. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసినట్లు అభియోగం మోపారు. నెల రోజుల్లోనే పోలీసులు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం భారీ బందోబస్తు మధ్య నిందితుడు సంజయ్ కుమార్ ను కోర్టుకు తరలించారు. వరంగల్ జిల్లా కోర్టు వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. విచారణ అధికారులు సీఐ జూపల్లి శివరామయ్య, ఏ సి పి శ్యామ్ సుందర్ కోర్టుకు హాజరైయ్యారు.