న్యూఢిల్లీ, అక్టోబరు 28
సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు భారత్ చేపట్టే చర్యలకు అమెరికా అండగా నిలుస్తుందని అగ్రదేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇండియా టూర్‌లో ఉన్న ఆయన మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ కామెంట్లపై ఇవాళ డ్రాగన్ దేశం చైనా స్పందించింది. సరిహద్దు వివాదం ద్వైపాక్షిక అంశమని, ఈ విషయంలో వాస్తవాలను, నిజాలను అమెరికా గ్రహించాలని చైనా పేర్కొన్నది. చైనా ఎంబసీ ఓ ప్రకటనలో స్పందిస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలు, న్యాయపరమైన హక్కులపై మూడవ పార్టీ జోక్యం అవసరం లేదని చైనా వెల్లడించింది. భారత్, చైనా మధ్య సరిహద్దు సమస్య ద్వైపాక్షిక అంశమని, రెండు దేశాలు ఈ అంశంపై చర్చిస్తున్నాయని, సైనికపరంగా, దౌత్యపరంగా చర్చలు జరుగుతున్నాయని, విభేదాలను పరిష్కరించే సామర్థ్యం రెండు దేశాలకు ఉన్నట్లు చైనా తన ప్రకటనలో వెల్లడించింది. ఈ అంశంలో జోక్యం చేసుకునే అవకాశం మూడవ పార్టీకి లేదని చైనా చెప్పింది. చైనాతో ప్రమాదం ఉందన్న వాదనలను ఆపేసి.. మెదడు నుంచి ప్రచ్చన్నయుద్ధ ఆలోచనల్ని తీసివేయాలని కోరింది. వాస్తవాలను గౌరవించి, స్థానిక సామరస్యతకు సహకరించాలని అమెరికాను చైనా కోరింది.