ఇద్దరి మనస్సులు కలవలేదా
విజయవాడ,
ఏడాది అనూహ్యమైన సన్నివేశం ఒకటి ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది. వెండితెర మెగాస్టార్. ప్రజారాజ్యం వ్యవస్థాపకుడు చిరంజీవి ఏకంగా కొత్త ముఖ్యమంత్రి జగన్ ఇంటికి సతీసమేతంగా వెళ్లి మరీ ఆయన ఆతీధ్యం స్వీకరించారు. ఆ సమయానికి టాలీవుడ్ నుంచి జగన్ ని ఏ ఒక్కరు అభినందించిన దాఖలాలు లేవు. పైగా జగన్ ని టార్గెట్ చేస్తూ ఎన్నికల బరిలోకి దిగిన మెగా తమ్ముడు పవన్ ఓడిపోయారు. ఆ తరువాత కూడా ఆయన ఎక్కడా తగ్గకుండా జగన్ మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. అలాంటి సమయంలో చిరంజీవి వెళ్ళి జగన్ ని కలవడం అంటే దాన్ని రాజకీయంగా అసాధారణమైన ఘటనగానే అంతా చూశారు.ఇక ఆ బంధం శాశ్వతం అన్నట్లుగా కూడా కధనాలు వెలువడ్డాయి. ఆ తరువాత జగన్ సర్కార్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదన మీద ఏపీ అగ్గిమీద గుగ్గిలమే అయింది. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు అన్నీ ఒక్కటై మరీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. జనసేనాని, మెగా తమ్ముడు పవన్ అయితే జగన్ మీద ఓ రేంజిలో రెచ్చిపోతున్న వేళ మెగాస్టార్ తాపీగా ఒక స్టేట్ మెంట్ ఇచ్చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన మంచిదేనంటూ స్వాగతించారు. దాంతో మెగా దన్ను జగన్ కి దక్కిందని అంతా అనుకున్నారు. వైసీపీకి మెగాస్టార్ మరింత చేరువ అయ్యారని కూడా విశ్లేషించారు.ఇక ఆ మీదట కరోనా వైరస్ సమయంలో సైతం జగన్ ఆహ్వానంపైన పలువురు సినీ ప్రముఖులను వెంటబెట్టుకుని ప్రత్యేక విమానంలో మెగాస్టార్ చిరంజీవి జగన్ ని తాడేపల్లిలో కలిశారు. ఏపీలో సినీ రంగం అభివృద్ధి మీద వీరిద్దరూ చర్చించారు. విశాఖలో సినీ ప్రముఖులకు స్టూడియోలు నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తామని కూడా జగన్ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం సాగింది. మెగాస్టార్ విశాఖలో స్టూడియో కడతారు అని కూడా అంతా చెప్పుకున్నారు. అది జరిగి కూడా నెలలు గడచాయి. ఈ మధ్యలో సోము వీర్రాజు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కావడం, ఆయన స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్ళి అభినందనలు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన, బీజేపీ కూటమి ఏపీలో అధికారంలోకి రావాలని మెగాస్టార్ ఆకాంక్షించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.ఇక ఇపుడు తాజా వార్తలు చూస్తూంటే చిరంజీవి హైదరాబాద్ లోని అవుటర్ రింగ్ రోడ్డులో తనకు ఉన్న పదెకరాల స్థలంలో మెగా స్టూడియో కడతారు అని అంటున్నారు. ఈ మేరకు అనధికార సమాచారం అయితే అవును అనే అంటోంది. మరో వైపు చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ నాచారం దగ్గర తమ భూములలో అల్లు స్టూడియోస్ పేరిట ఈ మధ్యనే శంఖుస్థాపన చేశారు. అంటే మెగా ఫ్యామిలీ ఇక హైదరాబాద్ ని వీడి రాదు అని దీంతో పక్కా క్లారిటీ వచ్చేసింది. ఇంతకాలం విశాఖలో మెగా ఫ్యామిలీ స్టూడియోలు వస్తాయని అంతా భావించారు. కానీ ఇపుడు హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏపీ వైపు వారు చూసేది లేదు అన్న సందేశం మాత్రం వచ్చేసింది. మరి రాజకీయంగా కూడా చిరంజీవి బీజేపీ జనసేన కూటమికి అనుకూలంగా కదులుతారు అని వినిపిస్తున్న వేళ ఆయన ఇకపైన జగన్ కి దూరం పాటిస్తారు అనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.