ఎన్నికల నిర్వహణకే మొగ్గు
విజయవాడ,
నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వీలయినంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముగించేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నట్లు కన్పిస్తుంది. ఎందుకంటే తాజాగా హైకోర్టులో ఆయన వేసిన రిట్ పిటీషన్ దాఖలు చేయడం దీనికి అద్దంపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు సహకరించడం లేదని ఆయన నేరుగా హైకోర్టుకు తెలపడం వెనక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను త్వరగా ముగించేయాలన్న తపనే కనపడుతుంది.నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కాలం వచ్చే ఏడాది మార్చి నెలతో ముగియనుంది. అప్పటి వరకూ ఎన్నికలకు వెళ్లకూడదని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య నెలల పాటు న్యాయపోరాటం జరిగిన సంగతి తెలిసిందే. చివరకు నిమ్మగడ్డదే విజయం కావడంతో ఆయనే తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు.అప్పటి నుంచే నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఎప్పుడో ప్రారంభమయింది. కానా కరోనా వైరస్ కారణంగా దానిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. ప్రభుత్వంతో కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా వాయిదా వేయడంతోనే నిమ్మగడ్డకు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ మొదలయింది. అది పెరిగి పెద్దదయింది. హైకోర్టు కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డంకి ఏంటని ప్రశ్నించడంతో నిమ్మగడ్డకు అనుకూలంగా మారిందంటున్నారు.బీహార్ లాంటి చోట్లే శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీలో జరపాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. అయితే తనకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించిందని భావించి ముందుగానే నిధులు ఇవ్వడం లేదన్న నెపంతో నిమ్మగడ్డ హైకోర్టులో పిటీషన్ వేసినట్లు చెబుతున్నారు.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు. అయితే ఇప్పటికే అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని నీలం సాహ్ని లెక్కలతో సహా వివరించినట్లు తెలుస్తోంది. పోలీసు శాఖలో కూడా అనేక మంది వైరస్ బారిన పడ్డారని నీలం సాహ్ని నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ కష్టమనే భావనను నీలం సాహ్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కరోనా కేసులు కూడా ఇంకా తగ్గుముఖం పట్టలేదని, రోజుకు రాష్ట్రంలో తొమ్మిదివేలకు పైగా కేసులు నమోదవుతున్న విషయాన్ని కూడా నీలం సాహ్ని నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితులు కుదుటపడగానే తాము ఎన్నికల కమిషనర్ ను సంప్రదిస్తామని నీలం సాహ్ని చెప్పారని సమాచారం. హైకోర్టు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు సుముఖంగా ఉండటంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎప్పుడైైనా షెడ్యూల్ ప్రకటించే అవకాశముందంటున్నారు. మొత్తం మీద తన హయాంలోనే ఎన్నికలు జరపాలని నిమ్మగడ్డ, మార్చి తర్వాత అని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో ఎవరి మాట నెగ్గుతుందో చూడాల్సి ఉంటుంది మరి.