ఇంకా ...జగన్ మౌనం
విజయవాడ, అక్టోబరు 30
ఒక్కోసారి మౌనం కూడా ఇబ్బంది పెడుతుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏ విషయంలోనూ పెదవి విప్పరు. తనపైనా, తన ప్రభుత్వంపైన వచ్చే విమర్శలకు ఆయన నేరుగా సమాధానం చెప్పరు. మంత్రులు లేదా సీనియర్ నేతల చెప్పిస్తారు. కానీ దీనివల్ల వైసీపీ వర్షన్ ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదన్నది వాస్తవం. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలను స్వీకరించి పదిహేను నెలలు గడుస్తుంది. ఈ పదిహేను నెలల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో కొన్ని విమర్శలకు గురైనవి కూడా ఉన్నాయి.అయితే పదిహేను నెలలుగా జగన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలు రెండు, మూడుకు మించవు. అది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత జగన్ కరోనా మీద వరస మీడియా సమావేశాలు పెట్టినా ఆ అంశానికే పరిమితమయ్యారు. ఏపీలో రోజుకో వివాదం రాజుకుంటూనే ఉంది. విపక్షాలు ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.కానీ వీటి వేటిపైనా జగన్ నేరుగా స్పందించడం లేదు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. దీనిపైన కూడా జగన్ ఏమీ మాట్లాడ లేదు. ఇక రాజధాని అమరావతిలో రైతుల నిరసనలు 300 రోజులు దాటినా జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. రాజధాని రైతులకు ఫలానా సాయం ఇస్తానన్న ప్రకటన కూడా జగన్ నోటి నుంచి రాలేదు. దీంతో ఆ ప్రాంత రైతులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.ఇక అంతర్వేది రధం దగ్దం ఘటన, తిరుమల డిక్లరేషన్ వివాదాలపైన కూడా జగన్ ఏమాత్రం స్పందించలేదు. మంత్రులు కొడాలి నాని, ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లే స్పందించారు. జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తాను ఏం కోరింది? వాళ్లు ఏమిస్తారన్న విషయాన్ని కూడా జగన్ ప్రజలకు తెలియజేయలేదు. ఇలా జగన్ పదిహేను నెలలుగా మాస్క్ వేసుకునే ఉన్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్నాయి. ప్రతి అంశంలోనూ వైసీపీ ఇచ్చే వివరణ ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదని, అదే జగన్ నేరుగా చెబితే ప్రజలకు చేరుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు.