అశోక్ గజపతిరాజుకు మరో మారు అవమానం
విజయనగరం, అక్టోబరు 30
విజయనగరం పూసపాటి వంశీకుడు, ఇప్పటితరంలో పెద్ద దిక్కు అయిన అశోక్ గజపతిరాజుకు మరో మారు అవమానం జరిగినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారు పూసపాటి వారి ఆడపడుచు, ఇలవేలుపు. వందల ఏళ్ళ నుంచి రాజులు అమ్మవారికి తొలి పూజ చేసి మొక్కులు చెల్లిస్తారు. ఈసారి ఆ కుటుంబం తరఫున మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు హాజరయి ఆ కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో రాజు గారికి ఆ అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. దానికి తోడు వైసీపీ సర్కార్ ఏలుబడిలో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మంత్రి హోదాలో బొత్స సత్యనారాయణ సమర్పించారు. ఈ విధంగా అశోక్ గజపతిరాజు పాత్ర ఏదీ లేకుండానే ఈసారి ఉత్సవాలు ముగిసాయి అంటున్నారు.విజయనగరం రాజులు అంటే అశోక్,ఆనంద్ గుర్తుకువస్తారు. అయితే ఇపుడు మూడవ తరం ప్రతినిధిగా సంచయిత గజపతిరాజు ముందుకు వచ్చారు. ఆమె వంశం ప్రతినిధిగా ఉండగా పూసపాటి రాజుల ప్రమేయం లేదు అన్నది వట్టి మాట అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అయితే కావాలనే రాజులను అవమానించారని టీడీపీ నేతలు అనడంతో ఇది కొత్త రాజకీయ వివాదానికి దారితీస్తోంది. రాజులలో పెద్దవారు, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ అయిన అశోక్ గజపతిరాజు ఉండగా ఆయన్ని కావాలనే పక్కన పెట్టారని అన్న విమర్శలు వస్తున్నాయి.ఇక సంచయిత గజపతిరాజు రాజకీయాలు తెలియకపోవడం వల్ల కూడా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. ఆనందగజపతిరాజు రెండవ భార్య సుధా గజపతిరాజు, ఆమె కుమార్తె ఊర్మిళా గజపతిరాజుకోట మీద నుంచి ఉత్సవం చూడడానికి వస్తే వారిని ఆమె రాకుండా చేశారని కూడా కొత్త ఆరోపణలు కూడా చేస్తున్నారు. మొత్తానికి రాజుల కోటలో పగలు ప్రతీకారాలకు ఈసారి అమ్మవారి ఉత్సవాలు ఒక వేదిక అయ్యాయని కూడా చెబుతున్నారు. సంచయిత నిజంగా తన చెల్లెల్ని, పినతల్లిని కోట బురుజు వద్దకు రానీయలేదు అంటే అతి చేశారనే భావించాల్సి ఉంటుందనే ప్రజలు తటస్థులు కూడా అంటున్నారు.అశోక్ గజపతిరాజు కుటుంబం వర్చువల్ దర్శనం చేసుకుని తృప్తి పడిందని అంటున్నారు. అమ్మ వారిని ఎక్కడ నుంచి అయినా దర్శించుకోవచ్చునని కూడా అశోక్ తన సన్నిహితులతో అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా రాజకీయాలతో సంబంధం లేకుండా రాజులను ఆదరించే ప్రజలు మాత్రం ఈసారి ఉత్సవాలలో అశోక్ కుటుంబం కనబడకపోవడాన్ని ఒక లోటుగానే భావిస్తున్నారుట. వైసీపీ సర్కార్ పెద్దలు ఈ విషయంలొ కొంత సంయమనం తో వ్యవహరిస్తే బాగుండేది అన్నది కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా రాజులుగా ఒకనాడు చక్రం తిప్పిన అశోక్ ఇపుడు తాజా రాజకీయాల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు.