పవన్ కిం కర్తవ్యం
విజయవాడ, అక్టోబరు 30
పార్టీ అధినేత ఉన్నా ఎక్కడికక్కడ క్యాడర్ ను నడిపించే నేతలు ఉండాలి. జనసేన పార్టీకి అదే కొరవడింది. జనసేన పార్టీని పవన్ కల్యాణ్ ఆరేళ్ల క్రితమే పెట్టారు. అయినా పార్టీని క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకూ బలోపేతం చేయలేదు. వానొచ్చినట్లు ఓట్లు వచ్చి పడతాయని పవన్ కల్యాణ్ భావించడమే ఇందుకు కారణం. పైగా పవన్ కల్యాణ్ కు నేతలెవ్వరిపై నమ్మకం లేదంటారు. పార్టీని అడ్డం పెట్టుకుని ఏదైనా వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతారన్న భావన కూడా ఉంది.అందుకే జనసేన పార్టీ ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం కాలేదు. నిజానికి పవన్ కల్యాణ్ కు ఏపీలో లక్షలాది మంది అభిమానులున్నారు. మొన్న ఎన్నికల ప్రచారంలోనూ పవన్ కల్యాణ్ సభలు అభిమానులతో కిక్కిరిసిపోయేవి. కానీ ఎన్నికల్లో మాత్రం దాని ప్రభావం కన్పించలేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కడికక్కడ సరైన నాయకత్వం లేకపోవడం వల్ల వారిని సరైన దారిలో నడిపించలేకపోయారన్నది అందరూ అంగీకరించే అంశమే.పవన్ కల్యాణ్ తొలి నుంచి తన ఫిగర్ తోనే ఎన్నికలకు వెళ్లాలని భావించారు. అంతవరకూ బాగానే ఉన్నా అసలు నాయకులే లేకపోతే ఎలా అన్నది ఆయన ఆలోచించ లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత అనేక మంది నేతలు పవన్ కల్యాణ్ నాయకత్వంపై నమ్మకం లేక పార్టీని వీడిపోయారు. జేడీ లక్ష్మీనారాయణ వంటి నేతలే పవన్ కు నాయకత్వ లక్షణాలు లేవని చెప్పడం విశేషం. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు కూడా పవన్ కల్యాణ్ కు ఇబ్బందికరంగా మారిందంటున్నారు.బీజేపీతో పొత్తు తర్వాత పవన్ కల్యాణ్ ను అభిమానించే వారు సయితం పార్టీకి దూరం జరిగారు. సోషల్ మీడియాలోనూ జనసైనికులే పవన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకపోయినా బీజేపీతో హడావిడిగా పొత్తు పెట్టుకోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు విన్పించాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ పొరుగు రాష్ట్రంపై చూపే ప్రేమను ఏపీపై చూపకపోవడాన్ని కూడా పార్టీలోనే కొందరు తప్పుపడుతున్నారు. పవన్ ఏక నాయకత్వంతో పార్టీ బలం పెరిగే అవకాశం లేదంటున్నారు. బీజేపీతో కలసిన తర్వాత పార్టీలో పవన్ ఇమేజ్ మరింతగా దిగజారిందన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి.