విద్యార్థులకు ఆధార్ అప్‌డేషన్ అనివార్యం
హైద్రాబాద్, అక్టోబరు 30,
పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం తలపెట్టిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల అమలును ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ పథకాలకు విద్యార్థుల వేలిముద్రల సమర్పణను తప్పనిసరి చేసింది. ఈ పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తును సమర్పించిన తర్వాత ప్రతి విద్యార్థి ఇకపై బయోమెట్రిక్ ఎంట్రీ చేయాల్సిందే. ఇదివరకు మాన్యువల్ పద్ధతిలో వివరాల నమోదుతో దరఖాస్తును ఆమోదించే అధికారం సంక్షేమాధికారికి ఉండేది. కానీ ప్రస్తుతం ప్రతి విద్యార్థి తప్పకుండా ఆధార్‌తో అనుసంధానమైన వేలిముద్రలు సమర్పిస్తేనే దరఖాస్తు సంక్షేమాధికారికి చేరుతుంది. అయితే ఆధార్ ఆధారిత వేలిముద్రలు సరిపోలడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యార్థులు ఆధార్ కార్డు పొందిన సమయంలో ఇచ్చిన ఫింగర్ ప్రింట్స్ ప్రస్తుతం సమర్పించే ప్రింట్స్ సరిపోలడం లేదు. పిల్లల్లో ఎదుగుదల వేగంగా ఉండటంతో వేలిముద్రల్లో మార్పులు వస్తున్నాయి. దీంతో పోస్టుమెట్రిక్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఆధార్ అప్‌డేషన్ అనివార్యమవుతోంది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులో విద్యార్థి ఆధార్ నంబర్ తప్పనిసరి. ఈ నంబర్ ఎంట్రీ చేయడంతో దానికి అనుసంధానమైన వేలిముద్రలు దరఖాస్తులో భాగమవుతాయి. ఈ దరఖాస్తు కాలేజీ ప్రిన్స్‌పల్ లాగిన్‌కు చేరుతుంది. అక్కడ దరఖాస్తును తెరిచి పరిశీలించిన తర్వాత విద్యార్థి తన వేలి ముద్రలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఆధార్‌తో అనుసంధానమైన వేలి ముద్రల్లో ఏమాత్రం తేడా ఉన్నా సాఫ్ట్‌వేర్ ఆమోదించదు. ప్రతి ఐదేళ్లకోసారి ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ నిబంధనలు చెబుతున్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన మార్పులు, కొత్తగా చేరికలను ఎంట్రీ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఈ అప్‌డేషన్ ప్రక్రియ అవసరముందని సంక్షేమ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోని విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు సమయంలో ఇబ్బందులు వస్తున్నందున ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల దరఖాస్తుకు వచ్చేనెల 30వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించింది. వాస్తవానికి ఇప్పటికే గడువు ముగియాల్సి ఉండగా.. కోవిడ్–19 వ్యాప్తి, అడ్మిషన్ల ప్రక్రియలో జాప్యం నెలకొనడంతో దరఖాస్తుల స్వీకరణ ఆలస్యంగా ప్రారంభించారు. వచ్చే నెలాఖరు వరకు దరఖాస్తుకు సమయం ఉండటంతో ఆలోపు దీర్ఘకాలికంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోని విద్యార్థులు ఆధార్ నమోదు కేంద్రాల్లో వేలి ముద్రలు సమర్పిస్తే సరిపోతుంది.