YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

నల్గొండ,  

ఇసుక అక్రమ రవాణా నేరమని, శిక్షార్హమని తెలిసినా కొందరు అక్రమార్కులు వెనకడుగేయడంలేదు. ఇష్టానుసారం తవ్వకాలు సాగిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. వీరి ఆగడాలతో భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ దందా సాగుతున్న సమీప ప్రాంతాల్లోని వ్యవసాయక్షేత్రాలకు నీటి కొరత ఏర్పడుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్నా, బాధ్యులకు కఠిన శిక్షలు విధిస్తామని స్పష్టం చేస్తున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండడంలేదు. అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడడంతో అక్రమార్కులు ఆడింది ఆట పాడింది పాటగా మారుతోంది. నల్గొండ జిల్లాలోని చింతపల్లి ప్రాంతంలో ఈ తరహా దందానే యథేచ్ఛగా సాగిపోతందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనాజీపురం వాగు ఇష్టానుసారం ఇసుకను తవ్వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. ప్రాంతీయంగా డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా జలాశయాలు, కాల్వలను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాల సాకుతో నిత్యం వందల లారీల, టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు అంటున్నారు. 

 

జలాశయానికి ఇసుకను తరలిస్తున్నట్లు చెప్పుకుంటూ ఇతర ప్రాంతాల్లో అక్రమార్కులు నిల్వచేస్తున్నారని స్థానికులు స్పష్టంచేస్తున్నారు. చింతపల్లి నుంచి మాల్‌ వరకు బయటి మార్కెట్‌లో ఈ ఇసుకను విక్రయిస్తున్నారని అంటున్నారు. అక్రమార్కులు విక్రయిస్తున్న ఇసుక విలువ రోజుకు రూ.2లక్షల వరకు ఉంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనాజీపురం వాగు నుంచి వందలాది వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతోందని అంటున్నారు. ఈ దందాపై స్థానిక రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే తమకేం సంబంధం లేనట్లు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఇసుకకు గనుల శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారని తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెప్తున్నారని అంటున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందంటున్నారని వాపోతున్నారు. ఇలా గనులు, రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య సమన్వయ లేకపోవడటంతో ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగాలు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు తెరదించాలని స్థానికులు కోరుతున్నారు. లేకుంటే నీటి వనరులు క్షీణించిపోతాయని, తాగు, సాగు నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

Related Posts