ఆస్తి పన్ను భారం
గుంటూరు,అక్టోబర్ 31,
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆత్మనిర్బర్ భారత్ పేరుతో పట్టణాల్లో చేపట్టిన సంస్కరణలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల నిర్వహణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వకుండా సొంతంగా నిలదొక్కుకోవాలని ఇందుకోసం ప్రజలపై పన్నుల భారాన్ని మోపాలని సూచిస్తోంది. ఈ మేరకు గుంటూరులో ఆస్తి పన్ను పెంపుదలకు కసరత్తు జరుగుతోంది. అయితే భారం ఎంత స్థాయిలో ఉంటుందో ఊహిస్తే ప్రజలు దిమ్మెరపోవడం ఖాయం. ఇప్పటి వరకు నిర్మాణానికే పన్ను విధించేవారు. ఇప్పుడు మొత్తం స్థలానికి, నిర్మాణానికి వేర్వేరుగా రిజిస్ట్రేషన్ ధర ఆధారంగా ఆస్తి పన్నులను విధించనున్నారు.ఒక వైపు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెబుతున్న వైసిపి ప్రభుత్వం వివిధ రూపాల్లో పన్నులను భారీగానే పెంచుతోంది. ఇందులో భాగంగా గుంటూరులో ఆస్తి పన్ను పెంపుదలకు గ్రీన్ సిగల్ ఇచ్చింది. ప్రస్తుతం గుంటూరులో లక్షా 55 వేల మంది నివాసితులు, వ్యాపార నిర్మాణ దారులు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. అలాగే మరో 26 వేలు ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. వీరి నుంచి ఏడాదికి రూ.93 కోట్లు గుంటూరు కార్పొరేషన్‌కు ఆదాయం లభిస్తోంది. గుంటూరును జోన్ల వారీగా విభజించి ఆస్తిపన్ను పెంచడానికి అధికారులు తలము నకలై ఉన్నారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ఇంటి పన్ను (ఆస్తి పన్ను) చదరపు అడుగుకు రూ.15 నుంచి రూ.25 వరకు ఉంది. రేకుల షెడ్డు, పెంకిటిల్లు, శ్లాబ్ వేసిన భవనాలను మూడు కేటగిరీలుగా విభజించారు. అలాగే కమర్షియల్ భవనాలకు కనిష్టంగా రూ. 50 లు, గరిష్టంగా రూ.100 వరకు పన్ను వసూలు చేస్తున్నారు. స్థలాలకు మాత్రం చదరపు గజాలకు పన్నులు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న పన్నుల విధానంలో సమూల మార్పులు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఇక నుంచి ఇంటి నిర్మాణంతో ప్రహరిలోపల ఉన్న ఖాళీ స్థలానికి కూడా పన్ను విధించే ప్రతిపాదన ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వాణిజ్య భవన నిర్మాణం వరకే పరిమితం కాకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్నుల వసూలుకు గణాంకాలు రూపొందిస్తున్నారు. రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్నులు విధిస్తే ఇప్పుడు చెల్లిస్తున్న పన్నులు ఏకంగా పది రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మూడు వేలు చెల్లిస్తున్నవారు భవిష్యత్తులో రూ.30 వేల వరకు చెల్లించే ప్రమాదం ఉంది. గుంటూరులో వివిధ ప్రాంతాల్లో గజం విలువ గరిష్టంగా రూ.40 వేల వరకు ఉంది. దీని ప్రకారం గృహాలకు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం 0.5 శాతం, వాణిజ్య ప్రాంతాల్లో ఒక్క శాతం పన్ను విధిస్తారని తెలిసింది. దీని ప్రకారం ఇప్పుడు రూ. 3 వేలు చెల్లించే గృహ యజమాని భవిష్యత్తులో రూ.30 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వాణిజ్య అవసరాలకు ఉపయోగించే భవనాలకు ఈ పన్ను 15 నుంచి 20 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర మునిసిపల్ పరిపాలనశాఖ కార్యాలయంలో వివిధ మునిసిపాలిటీల పన్నుల పెంపునకు సంబంధించి ఆస్తి విలువ, ప్రస్తుతం ఉన్న పన్ను, పెంచాల్సిన పన్నులపై కసరత్తు చేస్తున్నారు. ఇందులోభాగంగా గుంటూరు కార్పొరేషన్ రెవెన్యూ విభాగం అధికారులు కూడా తగిన వివరాలతో గణాంకాల తయారీలో నిమగం అయ్యారు. ఈ ప్రతిపాదనలన్నీ ప్రభుత్వానికి పంపి ప్రభుత్వం ఆమోదించిన వెంటనే గుంటూరులో అమలు చేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పన్నుల భారం ఉంటుందని భావిస్తున్నారు. ఒకే సారి 10 రెట్లు పన్నుల భారం పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న విషయం ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. దీనిపై త్వరలో మళ్లీ సమీక్ష చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.