YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జలకళ తీసుకొచ్చిన కాకతీయ మిషన్

జలకళ తీసుకొచ్చిన కాకతీయ మిషన్

నీటివనరుల పరిరక్షణకు తెలంగాణ పెద్ద పీట వేస్తోంది. చెరువులు తవ్వించడంతో పాటూ నీటి కుంటల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తోంది. చెరువులు పునరుద్ధరించేందుకు, కొత్తవి తవ్వేందుకు మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ చేపట్టిన చర్యల ఫలితంగా  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. వేసవి విజృంభిస్తున్నా ఈ చెరువుల్లో నీరు ఉండడంతో వాటి పరిధిలోని పంట పొలాలకు సాగునీటి కొరత కొంత తగ్గుముఖం పట్టింది. కేవలం భద్రాద్రి కొత్తగూడెంలోనే కాక ఖమ్మంలోనూ పలు చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో రైతుల్లోనే కాక స్థానికుల్లోనూ హర్షం వెల్లువెత్తుతోంది. ఉభయ జిల్లాల్లో 1,913 చెరువులను ఎంపిక చేసుకున్నారు. రూ.635.65 కోట్లతో ఇప్పటి వరకు 1,527 చెరువులను ఆధునీకరించారు. చెరువుల్లో నీరు చేరడంతో వాటికి సమీపంలోని వ్యవసాయక్షేత్రాలకు సక్రమంగా నీరు అందుతున్న పరిస్థితి నెలకొంది. దాదాపు చెరువుల ఆయకట్టు 1,76,534 ఎకరాలు సాగులోకి వచ్చినట్లు సమాచారం. చెరువు ఆధునికీకరణ, పునరుద్ధరణల పుణ్యమాని భూగర్భ జలాలు పెరిగాయి. బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగుపడింది. నీటి సమస్య కొంత తగ్గడంతో పలు ప్రాంతాల్లో ఆరుతడి పంటలకే పరిమితమైన చోట వరి పంటలు వేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు.

 

మిషన్‌ కాకతీయ నాలుగో దశలో భాగంగా ఖమ్మం జిల్లాలో 381 చెరువులు తవ్వించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. 381 ప్రతిపాదనల్లో 288 చెరువులకు అనుమతులు వచ్చాయి. వీటిలో ఆరు చెరువుల ప్రతిపాదనలు రద్దు చేసి పనుల కోసం రూ.6,681.21 లక్షల నిధులు మంజూరు చేశారు. 278 చెరువులకు టెండర్లు నిర్వహించి పనులు ఖరారు చేశారు. ప్రస్తుతం 260కిపైగా చెరువుల్లో పనులు సాగుతున్నాయి. నాలుగో దశ పనులు కూడా పూర్తైతే జిల్లాలోని మెజారిటీ చెరువులు ఆధునికీకరణకు నోచుకుంటాయి. అదే జరిగితే చెరువుల పరిధిలో మరింత ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఉన్న చెరువులను ఆధునికీకరణ చేయడంతో నీటి నిల్వ సామర్ధ్యం పెరిగి సాగునీరు అందడమే కాకుండా సమీప బోరు, బావుల్లో నీటి లభ్యత పెరగడం ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నీటి వనరులు మెరుగుపడితే సాగు, తాగు నీటికి సమస్యలు కూడా తప్పుతాయని చెప్తున్నారు. జలవనరుల పరిరక్షణలో భాగంగా జిల్లాలో చెరువుల తవ్వకం జోరుగా సాగుతుండడంతో స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. మరిన్ని చెరువులు తవ్వితే ఉభయ జిల్లాల్లో నీటి ఇబ్బందులకు తెరపడుతుందని చెప్తున్నారు.

పెరిగిన వేతనం వల్ల మెదక్ జిల్లాలోని 4లక్షల మందికిపైగా ఉన్న ఉపాధి కూలీలకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.30 లక్షల విలువైన పనులు కల్పించాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. ప్రస్తుతం వేసవిలో ఉపాధి హామీ పనులు ఎక్కువగా జరగనున్నాయి. ఈ ఏడాదిలో వందరోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలకు సైతం మళ్లీ పనులు కల్పించాలని నిర్ణయించారు. పండ్లతోటల పెంపకం, ఇంకుడుగుంతలు, వ్యవసాయ కుంటల, చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతున్నారు. దీంతో ఈ సీజన్ లో ఉపాధి కల్పన ఆశాజనంగానే ఉండనుంది. ఇదిలాఉంటే ప్రస్తుతం జిల్లాలోని ఆయా మండలాల్లో ప్రతిరోజు 57,344 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి రోజుకు కూలి రూ.205 చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన వేతనంతో కూలీలు  మరింత ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయి. ఉపాధి పనులు పెంచి.. లబ్ధిదారులందరికీ అధికారులు అవకాశం కల్పిస్తుండడంతో సర్వత్రా హర్షం వెల్లువెత్తుతోంది. వేసవి కావడంతో కూలీల ఆరోగ్య పరిరక్షణకూ ప్రాధాన్యతనివ్వాలని, పనులు జరిగే ప్రాంతాల్లో టెంట్లు వేయడంతో పాటూ, సత్వరమే ప్రాథమిక చికిత్స లభించే ఏర్పాట్లు కూడా చేయాలని అంతా సూచిస్తున్నారు. కూలీలకు మంచినీటి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts