పోలవరం తిప్పలు
విజయవాడ, అక్టోబరు 31,
రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో నాడు చంద్రబాబు.. నేడు జగన్ కూడా తిప్పలు పడుతున్నారు. నిజానికి ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని జాతీయ ప్రాజెక్టు. అయితే, దీనిని పూర్తిచేయడం ద్వారా నాలుగు జిల్లాలపై ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో నాడు చంద్రబాబు దీనిని మేమే నిర్మించుకుంటాం! అని తీర్మానం చేసి కేంద్రానికి పంపిన దరిమిలా.. కష్టాలు ప్రారంభమయ్యాయి. ముందు మీరు ఖర్చు పెట్టుకోండి తర్వాత మేం ఇస్తాం అనే ధోరణిలో కేంద్రం వ్యవహరిస్తోంది. ఈ పరిణామాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతోంది.గతంలో చంద్రబాబు కూడా పోలవరం ప్రాజెక్టును 2019 ఎన్నికల నాటికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అది సాధ్యం కాలేదు. ఇక, ఎన్నికల్లో దీని ఊసు కూడా లేకుండా ముందుకుసాగారు. ఇక, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ కూడా దీనిని పూర్తి చేసి తీరుతామని, వచ్చే ఏడాది కల్లా నీరు అందిస్తామని చెబుతున్నా.. దానికి తగిన విధంగా అడుగులు మాత్రం పడడం లేదు. నిధుల విషయంలో కేంద్రం కొర్రీలు వేస్తోంది. ఈ పరిణామాలతో ఇప్పుడు జగన్ సర్కారు కూడా మౌనం పాటిస్తోంది.మరోవైపు టీడీపీ వైసీపీ ప్రభుత్వంలో లొసుగులు, ఇతర ప్రజా సమస్యలతో పాటు అన్ని విషయాలను ఎత్తి చూపుతున్నా.. తాము అప్పట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం విషయాన్ని మాట్లాడడం లేదు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు నిధుల విషయంలో భారీ కోత వేసింది. అయినా.. చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడడం లేదు. దీంతో ఇప్పుడు జగన్ ఏం చేయాలనే విషయంపై తలపట్టుకున్నారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆ మేరకు నిధులు లేవు. దీంతో దీనిపై విమర్శలు వచ్చినా.. లేక, రేపు అసెంబ్లీలోనే చర్చ జరిగినా.. వ్యూహాత్మకంగా వ్యవహరించి.. ఈ గండం నుంచి తప్పు కొనేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.దీనిలో భాగంగా పోలవరం కాలేదంటే.. తప్పు మాదికాదు.. టీడీపీదేనని ఆయన ఈ విషయాన్ని టీడీపీ కోర్టులోకి విసిరేందుకు రెడీగా ఉన్నారు. అంతేకాదు, బీజేపీని కూడా అవసరమైతే.. నిందించేందుకు జగన్ రెడీగానే ఉన్నారని చెబుతున్నారు. ఈ పరిణామాలతో పార్టీ పై ఎలాంటి వ్యతిరేకతా లేకుండా బయట పడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందో ? చూడాలి.