వ్యాక్సిన్ పంపిణీ కోసం కసరత్తు
న్యూఢిల్లీ, అక్టోబరు 31,
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ సిద్ధమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అలర్ట్ చేసింది. కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి సన్నాహాలు ప్రారంభించాలని సూచించింది. వ్యాక్సిన్ వచ్చిన మరుక్షణమే దేశ ప్రజలందరికీ పంపిణీ చేయడానికి కసరత్తు ప్రారంభించింది. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు కొనసాగిస్తూనే.. సోషల్ మీడియాలో వచ్చే వదంతులపైనా దృష్టి సారించాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని దిశానిర్దేశం చేసింది.టీకా పంపిణీ డ్రైవ్‌ను సమన్వయం చేసుకోవడం, పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగే సమయంలో ఇతర ఆరోగ్య సేవలకు, అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
సోషల్ మీడియాను, ఆన్‌లైన్ మీడియాను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ.. వ్యాక్సిన్ పంపిణీని, దాని ఫలితాన్ని ప్రభావితం చేయగలిగే ఫేక్ వార్తలపై దృష్టి సారించాలని కేంద్రం సూచించింది. వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది. వ్యాక్సిన్ పంపిణీ మార్గదర్శకాలపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు.కరోనాతో పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్ని వైద్యులు, ఆరోగ్య సిబ్బందితోనే టీకా ప్రక్రియ ప్రారంభం అవుతుందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు సంవత్సరం పాటు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలతో ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ క్రమంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు విస్తరిస్తుందని పేర్కొంది.టీకా పంపిణీ కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. వ్యాక్సిన్ పంపిణీకి కావాల్సిన కోల్డ్ స్టోరేజీలు, పంపిణీ ప్రణాళిక, విభిన్న భౌగౌళిక ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ కమిటీలు నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా స్టేట్ స్టీరింగ్ కమిటీ ఉండాలని కేంద్రం సూచించింది. ఆరోగ్య శాఖ అడిషనల్ సెక్రటరీ నేతృత్వంలో రాష్ట్ర టాస్క్ ఫోర్స్ , జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం రాసిన లేఖలో సూచించారు.