2016 నవంబర్ లో కేంద్రప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేసింది. అంతే నాటి నుంచి నేటి వరకూ నగదు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు వాటిని మార్చుకుని.. కొత్త నోట్లు తీసుకునేందుకు ప్రజలు నానాఅగచాట్లు పడ్డారు. కొత్తనోట్లు సరిపడనంతగా లేక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఇప్పటికీ దాదాపు అదే పరిస్థితి. అయితే ప్రస్తుతం అవసరాల కోసం నగదు లేక సతమతమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాక ఈ దుస్థితి దేశవ్యాప్తంగా ఉంది. ప్రజలంతా నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల్లో క్యూలు కడుతున్నా పెద్దగా ఫలితం ఉండడంలేదు. ఏటీఎంల్లో అయితే నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో అవసరానికి సొమ్ము చేతికి అందక ప్రజలు పాట్లు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వాసులకు నగదు కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. డిమాండ్ కు తగ్గట్లుగా డబ్బు లేకపోవడం సమస్యాత్మకంగా మారింది.
నోట్ల రద్దు తర్వాత ఆర్‌బీఐ దాదాపు రూ. 5లక్షల కోట్ల విలువైన రూ. 2వేల నోట్లను ముద్రించింది. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం ఏప్రిల్ 6 నాటికి రూ. 18.17లక్షల కోట్ల నగదు చలమాణిలో ఉంది. పెద్ద నోట్లు రద్దు చేసే నాటికి ఎంతైతే చలామణిలో ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. అయినా సరే కరెన్సీ కొరత ఏర్పడింది. ఇందుకు ప్రధాన కారణం బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గడమే అని విశ్లేషకులు చెబుతున్నారు. టెక్నికల్ కారణాలు ప్రజలకు పెద్దగా అవసరం ఉండదు. అవసరానికి సొమ్ము చేతికి అందితే వారికి అదే పదివేలు. అయితే అత్యవసర పరిస్థితుల్లోనూ నగదు లేక ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. బయటివారి వద్ద అప్పు కూడా దొరకని పరిస్థితి. ఎందుకంటే అప్పు ఇస్తే తమకు అవసరం ఉన్నప్పుడు డబ్బు ఉండదన్న భావన పలువురిలో నెలకొంది. ఫలితంగా ఏడాదిన్నర గడిచినా నోట్ల రద్దు ఎఫెక్ట్ ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి. ఈ కండిషన్ పై స్పందించిన కేంద్ర ఆర్ధికమంత్రి త్వరలోనే డిమాండ్ కు తగ్గట్లుగా నగదును అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మరి ఈ హామీ నెరవేరడానికి ఎంత కాలం పడుతుందో వేచి చూడాలి.