YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జోరుగా అక్రమాలు!

జోరుగా అక్రమాలు!

కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్న రోజులివి. కొందరైతే దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. కొండలు-గుట్టలు, వాగులు-వంకలు వీరి ధాటికి రూపు కోల్పోతున్నాయి. అధికార యంత్రాంగం ఉదాసీనత, నిర్లక్ష్యాల ఫలితంగానే అక్రమార్కులు ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. వారు జాగ్రత్తగా ఉండి.. అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తే పరిస్థితి చేయిదాటిపోయే వరకూ రాదు. ఇలాంటి ఉదంతాలు ఇప్పటివరకూ చాలానే వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వాలు తరచూ సీరియస్ అవుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఫలితంగానే ఆదిలాబాద్ లోని మావల గ్రామ పంచాయితీ పరిధిలో భూ అక్రమాలు సాగుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొందరు పెద్దలు దాదాపు 140 ఎకరాల్లో అతి పెద్ద వెంచరు వేస్తున్నారని చెప్తున్నారు. చెరువుకు వరద నీళ్లొచ్చే వాగును సైతం కబ్జా చేసేశారని ఆరోపిస్తున్నారు. లే అవుట్‌లోని భూమి చదును చేయడానికి అవసరమైన మొరం తవ్వకాలతో ప్రకృతి ప్రసాదించిన గుట్టలను సైతం కనిపించకుండా చేశారని వాపోతున్నారు. దీనికి సంబంధి రెవెన్యూ అధికారులకు సమాచారం ఉన్నా  బాధ్యులపై చర్యలు తీసుకోవడంలేదని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

 

మావల వద్ద వేస్తున్న వెంచర్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు స్థానికులు స్పష్టం చేస్తున్నారు. వెంచర్ సమీపంలో ఉన్న చెరువును పూడ్చేస్తున్నారని అంటున్నారు. స్థానికంగా ఉన్న వాగునూ కొంతమేర ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ దందాపై రెవెన్యూతో పాటూ నీటిపారుదల విభాగం అధికారులూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. వెంచర్ వేస్తున్న భూముల్లో కొన్ని సామాన్యుల పేరిట ఉన్నాయి. అయితే వారి పేరు చెప్పుకుని కొందరు పెద్దలు ఈ దందా నడుపుతున్నట్లు స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలాఉంటే వెంచర్ వేస్తున్న భూముల్లో గుట్టలు, పెద్దపెద్ద బండరాళ్లు ఉన్నాయి. వీటిని పగులగొట్టేందుకు పేలుడు పదార్ధాలు వినియోగిస్తున్నారు. ఎటువంటి అనుమతుల్లేకుండానే జిలెటిన్‌స్టిక్స్‌ ఉపయోగించి ప్రతి రోజూ దాదాపు వంద సార్లు వరకు పేలుస్తున్నారు. దీంతో రాళ్లు లేచి .. పరిసరాల్లోని రైతుల పంట పొలాల్లో పడుతున్నాయి. సమీపంలోనే విద్యాసంస్థలుండటంతో పేలుడు శబ్ధానికి విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. ఈ పేలుళ్లకు స్థానికులంతా హడలిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి ఈ వెంచర్ సంగతి చూడాలని, అక్రమాలకు జరిగితే వాటిని అరికట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అంతా విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Posts