రాజమండ్రి రాజకీయాల్లో మాజీ ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం ఒక ఐకాన్ అనే చెప్పాలి. ఆయన భార్య వీర రాఘవమ్మ మేయర్ గా పనిచేశారు. అప్పారావు కొన్ని దశాబ్దాలపాటు రాజమండ్రి టిడిపి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తరువాత వైసిపి లోకి దూకి ఎమ్యెల్సీ అయిపోయారు. తిరిగి అదే పదవిలో ఉండగా మాతృసంస్థ టిడిపి లోకి వచ్చేశారు. స్వర్గీయ ఎర్రన్నాయుడు వియ్యంకుడిగా కూడా ఆయన కు మంచి గుర్తింపే టిడిపి లో ఉంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత గోరంట్లను సైతం పక్క నియోజకవర్గానికి పంపి అధిష్టానం ఆదిరెడ్డి కోడలు భవానీ కి రాజమండ్రి అర్బన్ టికెట్ ఇచ్చింది. ఆమె కూడా జగన్ హవాకు ఎదురొడ్డి గెలిచి అధిష్టానం నమ్మకాన్ని తమ కుటుంబానికి ఉన్న బ్రాండ్ ను కాపాడారు.ఒకే పార్టీ లో ఉన్నా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కి ఆదిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇద్దరి నడుమ ఆధిపత్య పోరులో కార్యకర్తలు సైతం నలిగిపోతున్నారు. రాజమండ్రి అర్బన్ లో గట్టి పట్టు ఉన్న గోరంట్ల తన పాత నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడాన్ని ఆదిరెడ్డి కుటుంబం అడ్డుకుంటూ వస్తుంది. ఏ చిన్న అంశం చోటు చేసుకున్నా అధిష్ఠానం ముందుకు ఫిర్యాదులు వెళ్ళేవి. ఇలా అంతర్గతంగా తన్నుకుంటున్న తమ్ముళ్లను టిడిపి అధిష్టానం జాగ్రత్తగానే సర్దుబాటు చేసింది. ఎవరి సరిహద్దులు వారు దాటకుండా లక్ష్మణ రేఖలు గీసేశారు. దాంతో కొంతవరకు గొడవలు సర్దుమణిగాయి.తెలుగుదేశం పార్టీ అధిష్టానం తాజాగా ఇచ్చిన పార్టీ పదవుల పందేరంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పాలిట్ బ్యూరో సభ్యునిగా ఎంపిక చేయడంతో ఆయన చక్రం తిప్పనున్నారు. పార్టీలో కీ పొజిషన్ పోస్ట్ కావడంతో ఇప్పుడు ఆదిరెడ్డి నమ్మిన బంట్లుగా ఉన్నవారు కూడా నెమ్మదిగా గోరంట్ల వెనుకకు చేరుతున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలతో కొత్త వ్యూహాలతో ఆదిరెడ్డి కుటుంబం బుచ్చయ్య రాజకీయ వ్యూహాలను ఎదుర్కొవాలిసి ఉంది. అటు పార్టీ లో అంతర్గతంగా ఇటు అధికారపార్టీ నేతలతో ఒకేసారి యుద్ధం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి అర్బన్ రూరల్ రాజకీయాలు ఇకపై మంచి రసపట్టులో నడవడం ఖాయంగా కనిపిస్తుంది.