YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

మాయమవుతున్న చెరువులు

మాయమవుతున్న చెరువులు

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి, నగర జీవికి సేద తీర్చేందుకు, భూగర్భ జలాలను పెంపొందించేందుకు చెరువులు ఎంతగానో దోహదం చేస్తాయి. ఒక ఊర్లో చెరువులు, వాటి నీటి సామర్థ్యాన్ని బట్టి ఆ గ్రామ ప్రజల ఆర్థిక పరిస్థితులను ఇట్టే చెప్పేయవచ్చు. చెరువుల్లో నీరుంటే జనం నోటి కాడికి కూడు వెళ్తాది. కాని నేడు అంతటా చెరువులు మాయమైపోయే పరిస్థితి దాపురించింది. జన సంచారాలు పెరిగిపోవడం, ప్రజల జీవన విధానం, పరిశ్రమల కాలుష్యం, చెరువులను పరిరక్షించే ప్రభుత్వ పటిష్ట విధానం లేకపోవడం వెరసి చెరువులు (వాటర్‌ బాడీస్‌) కనిపించకుండా పోతున్నాయి. ఒకవేళ ఉన్నా వాటిలో జల కళ ఉండడం లేదు. వాటి సామర్థ్యం ఏనాడో కునారిల్లిపోయింది. విశాఖ జిల్లా, చుట్టుపక్కల పరిసరాల్లో చెరువులు 150 వరకూ నీటి సామర్థ్యాన్ని కోల్పోయాయని ఎపి రాష్ట్ర ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆధిత్యనాథ్‌ దాస్‌కు విశాఖకు చెందిన మాజీ ఐఎఎస్‌ అధికారి ఇఎఎస్‌ శర్మ తాజాగా లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో పాడైపోయి, వాటి నిర్థిష్టమైన సామర్థ్యాన్ని కోల్పోయిన చెరువులపై నివేదిక ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపిలోనూ ఇదే పరిస్థితి ఉందని తక్షణం ఇరిగేషన్‌, గ్రామ, వార్డు స్థాయి ప్రభుత్వ సిబ్బంది ద్వారా సర్వే జరిపి చెరువుల పరిస్థితిపై నివేదిక రూపొందించకపోతే భవిష్యత్‌ తరాలకు తాగడానికి సైతం నీరుండదని ఇఎఎస్‌ శర్మ ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.జిల్లాలోని రావికమతం మండలం మైనర్‌ ఇరిగేషన్‌ రిజర్వాయర్‌ కల్యాణలోవ 5వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే సామర్థ్యం ఉండేది. అక్రమ మైనింగ్‌తో క్యాచ్‌మెంట్‌ ఏరియా పడిపోయి పలు గ్రామాలకు సాగు, తాగు నీరందే అవకాశాలు పడిపోయాయని ఇఎఎస్‌ శర్మ తన లేఖలో పేర్కొన్నారు. అధికారులు కళ్లున్నా కబోదుల్లా వ్యవహరిస్తూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొందని, తక్షణమే సర్వే చేపట్టడం ద్వారా చెరువులను రక్షించుకోవాలని సూచిస్తున్నారు.నగరంలోని ముడసర్లోవ చెరువును బాగు చేసిన దాఖలా లేనందున సిల్ట్‌ అధికమై దాని నీటి సామర్థ్యం పడిపోయింది. పక్కనేగల పైనాపిల్‌ కాలనీకి చెందిన వ్యర్థాలన్నీ ఈ నీటిలో కలుస్తుండడం, అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ మట్టిని తీసి ఈ చెరువులో పడేయడంతో చెత్తా, చెదారాలతో ముడసర్లోవ పూర్తిగా పేరుకుపోయింది. విశాఖలో పరిశ్రమల కాలుష్యం వల్ల కూడా పలు చెరువులు కలుషితమై చెరువుల్లో నీరున్నా అవి తాగితే ప్రమాదకర పరిస్థితులు నెలకొనే స్థాయికి వెళ్లిపోయాయి. ఈ విధంగా 150 చెరువుల వరకూ సామర్థ్యంను కోల్పోయినట్లు ఇఎఎస్‌ శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు.దశాబ్దాలుగా నగర జీవనం విస్తరించడంతో చెరువులను కప్పేసి ప్లాట్‌లు వేయడం, ఆక్రమించడం వంటి కార్యకలాపాలు విశాఖలో నానాటికీ పెరిగిపోయాయి. సింహాచలం కొండలపై నుంచి 7 వనరుల ద్వారా ముడసర్లోవలోకి నీరు వచ్చి చేరేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్యాచ్‌మెంట్‌ ఏరియా పూర్తిగా పడిపోయింది. జివిఎంసి చేసే పనులతో ముడసర్లోవలోకి పైన తెలిపినట్లు 'గార్బేజీ డంపింగ్‌' కూడా చెరువులను చంపేస్తుంది. విజయనగరం జిల్లాలోని ఓ పరిశ్రమ నీటిని ట్రీట్‌మెంట్‌ చేయకుండా వదిలేయడం వల్ల విశాఖలోని మేఘాద్రిగెడ్డకు టాక్సిక్‌ కాలుష్య కారకాలు రావడంతో మేఘాద్రిగెడ్డ నీరు కూడా కలుషితమై సామర్థ్యం అద:పాతాళానికి నెట్టబడింది. భీమిలి కేంద్రంలోని పెద్దచెరువును రియల్‌ ఎస్టేట్‌ కుబేరులు తమ గుప్పెటకు తీసుకోవడంతో నీటి లభ్యత, సామర్థ్యం పడిపోయినట్లు ఇరిగేషన్‌ అధికారులే స్వయంగా చెబుతున్నారు. పరవాడ మండలంలోని పరవాడ, తానాం గ్రామాల మధ్య గల ఊరచెరువు ఫార్మా సిటీ వ్యర్థ జలాల వల్ల కలుషితమై దుర్గంధం వెదజల్లుతోంది. ఈ నీరు పంట పొలాలకు పనికి రాకపోవడంతో ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో విశాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని రాష్ట్ర ప్రభుత్వం చెరువులను రక్షించేందుకు సర్వే జరపాలంటూ ఏపి ప్రభుత్వాన్ని ఇఎఎస్‌ శర్మ తన లేఖలో కోరారు.

Related Posts